కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

18 Nov, 2019 05:05 IST|Sakshi

సంచలనంగా మారిన సంజయ్‌తో ఫోన్‌ కాల్‌ వ్యవహారం

అసెంబ్లీ ఫలితాల తర్వాత సంజయ్‌తో కలెక్టర్‌ 8 నిమిషాల సంభాషణ

పరిమితికి మించి ఎన్నికల ఖర్చు, ఎమ్మెల్యేల అనర్హతపై చర్చ

‘సాక్షి’కి చిక్కిన సంజయ్, సర్ఫరాజ్‌ల వాయిస్‌ కాల్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌ కుమార్, కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ సంచలనంగా మారింది. 1.30 నిమిషాల ఆడియో టేప్‌ను శనివారం కొందరు వ్యక్తులు వైరల్‌ చేయగా.. అందులో కలెక్టర్‌ సూచనలు, సంజయ్‌ కృతజ్ఞతలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సంభాషణ 8 నిమిషాలు జరిగిందని, కట్, మిక్స్‌ విధానం ద్వారా కొందరు తమ సంభాషణను వక్రీకరించి వైరల్‌ చేశారని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ‘సాక్షి’దృష్టి సారించి 8 నిమిషాల ఒరిజినల్‌ ఆడియో టేప్‌ను సంపాదించింది. ఇందులో కూడా సంజయ్‌ సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేయడమే ఎక్కువగా ఉన్నాయి.

తెరపైకి నరోత్తం మిశ్రా కేసు 
పెయిడ్‌ న్యూస్‌ కారణంగా 2017లో మూడేళ్ల అనర్హత వేటు పడ్డ మధ్యప్రదేశ్‌ మంత్రి, దాటియా నియోజకవర్గం ఎమ్మెల్యే నరోత్తం మిశ్రా కేసు గురించి కలెక్టర్‌ సర్ఫరాజ్‌.. బండి సంజయ్‌కు ఫోన్‌లో వివరించడం గమనార్హం. శ్వేత చానల్‌ అనే లోకల్‌ కేబుల్‌లో వచ్చిన వార్తలను ‘పెయిడ్‌ న్యూస్‌’గా పేర్కొంటూ సంజయ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్‌ కాల్‌లో అదే విషయాన్ని కలెక్టర్‌ గుర్తు చేస్తూ ‘శ్వేత చానల్‌ ఫిర్యాదుకు సంబంధించి ఆర్డర్‌ ఇచ్చాను. 10వ తేదీలోపు ఈసీ నుంచి వచ్చిన వ్యయ పరిశీలకుడికి దానిని అందజేయవచ్చు’అని సూచించడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఫాలో అప్‌ చేసుకోమని సూచించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అలాగే ఒక రాష్ట్రానికి చెందిన హైకోర్టు ఓ ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించిన విషయం వార్తా పత్రికలో చూశానని కలెక్టర్‌ చెబుతూ..దానిని వాట్సాప్‌లో పెడతానని సంజయ్‌కు చెప్పడం కాల్‌లో స్పష్టంగా ఉంది.

ఎన్నికల్లో సిబ్బంది మీద ఒత్తిడా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్‌లో ఉద్యోగుల మీద ఒత్తిడి ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌.. బండి సంజయ్‌కు చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అవతలి వ్యక్తులకు సపోర్టు చేశారనికలెక్టర్‌తో సంజయ్‌ చెప్పగా.. ‘ఉండొచ్చు. మా స్టాఫ్‌ అంతా ఒత్తిడిలో పనిచేస్తున్నారు’అని పేర్కొనడం గమనార్హం. స్వయంగా కలెక్టరే స్టాఫ్‌ మీద ఒత్తిడి ఉందని పేర్కొనడాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ తప్పుబట్టారు. ఇదే సంభాషణలో ‘మీరు లేకపోతే కరీంనగర్‌ ఎన్నిక జరిగేది కాదు’అనే ధోరణితో సంజ య్‌ మాట్లాడగా... దానికి తాను అంగీకరిస్తున్నానని చెబుతూ నే ఉద్యోగం పోతదనే భయం పెట్టి మరీ వీలైనంత వరకు న్యూట్రల్‌గా ఎన్నిక జరిపేందుకు ప్రయత్నించానని కలెక్టర్‌ చెప్పడం విశేషం.

ప్రభుత్వ రహస్యాలు వారికెందుకు?: గంగుల 
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన ఓటమి లక్ష్యంగా పనిచేశారని మంత్రి గంగుల కమలాకర్‌ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఓడిన అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం, కోర్టులను ఆశ్రయించడం సహజమే కానీ, ఆ అభ్యర్థులకు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న అధికారి సలహాలు, సూచనలు చేయడాన్ని తప్పుపట్టారు.

ముఖ్యమంత్రికి ఆడియో టేప్‌
8 నిమిషాల ఆడియో టేప్‌ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మంత్రి గంగుల కమలాకర్‌పంపించారు. తనను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థితో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని లిఖి తపూర్వక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై సీఎస్‌ విచారిస్తున్నట్లు సమాచారం. జిల్లా పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచి అధికారులు ఈ లీకైన ఆడియో టేపులను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిసింది.

కలెక్టర్‌: రెండు రోజుల క్రితం ఏదో హైకోర్టు ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. పరిమితికి మించిన వ్యయం కేసులో.. ఆ న్యూస్‌ క్లిప్పింగ్‌ మీకు పంపుతాను. ఇంకొకటి నరోత్తం మిశ్రా కేసు. అది పెయిడ్‌ న్యూస్‌ వల్ల ఉంది. శ్వేత చానల్‌పై కంప్లెయింట్‌ చేశారు కదా.. దానికి నేను ఆర్డర్‌ ఇచ్చాను. ఫర్‌ పెయిడ్‌ న్యూస్‌. దాన్ని తీసుకుని కూడా మీరు వెళ్లొచ్చు. జనవరి 10 వరకు ఫైనలైజ్‌ అవుతది. అది ఫాలోఅప్‌ చేసుకోండి. మీరు నాకు ఫోన్‌ చేయొచ్చు. ఎక్కడ డిస్‌క్వాలిఫై అయిండో ఒకట్రెండు రోజుల పేపర్‌లో చూశాను. అది మీకు పెడతాను.

బండి సంజయ్‌: ఆర్‌ఓఆర్‌ బాగా సపోర్ట్‌ చేసిన్రు సార్‌ వాళ్లకు..

కలెక్టర్‌: ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే.. మా స్టాఫ్‌ అంతా చాలా ప్రెషర్‌ మీద వర్క్‌ చేస్తున్నారు.

సంజయ్‌: మీ భయంతోనే చేసిన్రు సార్‌. మీరు లేకుంటే కరీంనగర్‌ ఎలక్షన్‌ జరిగేది కాదు.

కలెక్టర్‌: ఐ అగ్రీ టు దట్‌. చాలా వరకు నేనే పుష్‌ చేశాను. లేకపోతే ఉద్యోగం పోతది. ఇది పోతది.. అది పోతది అని భయపెట్టి యాజ్‌ ఫార్‌ యాజ్‌ పాజిబుల్‌ న్యూట్రల్‌ గా చేసుకునే ప్రయత్నం చేసినారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌ చేసిన ఫోన్‌ కాల్‌ సంభాషణలోని కొన్ని పాయింట్లు ఇవి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా