‘కేంద్ర బృందాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది’

2 May, 2020 18:00 IST|Sakshi

 ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడం లేదు: బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. శనివారం  కేంద్ర హోంశాఖ కార్యదర్శికి బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాధి చికిత్స తీరులను, వైద్య సదుపాయాలను సమీక్షించడానికి మరొక ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ను పంపించాలని కోరారు. ఇంకా ఆ లేఖలో .. ‘‘ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడం లేదు. అలాగే  వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యడంలేదు. పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిన గాంధీ ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి మాకు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఆస్పత్రిలో సరిపడా వాష్‌రూమ్‌లు లేకపోవడం, ఉన్నవాటిలోనూ చాలా సమస్యలు ఉండటం వంటి ఫిర్యాదులు ఉన్నాయి.

చాలావరకు గదులు, వార్డులకు ప్రత్యేక బాత్‌రూమ్‌లు లేవు. ఐసీఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడం లేదు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రమైన పరిస్థితులు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది సరిపడా లేరు. రోగులను గుర్తించడంలో, పరీక్షించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. సి.ఎస్. శాస్త్రి అనే ఎనభై ఏళ్ల వ్యక్తి కరోనా అనుమానంతో ఏప్రిల్ 12న గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత అతన్ని నెగటివ్‌గా ప్రకటించారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా ప్రకటించారు. అనంతరం ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఏప్రిల్ 26న తుది శ్వాస విడిచారు. ఏదేమైనా, ఏప్రిల్ 26, 27, 28 నివేదికలలో ప్రభుత్వం అతని మరణాన్ని చూపించలేదు. అయితే, అతను 26వ తేదీన కరోనాతో మరణించాడని మరణ నివేదిక స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుంది. ( కచ్చితంగా తప్పే: తబ్లిగీ జమాత్‌పై యోగీ ఫైర్‌! )

తక్కువ సంఖ్యలో మరణాలు, కేసులను ఎందుకు చూపించాలనుకుంటున్నారు. కేంద్ర బృందానికి తగిన ఆధారాలతో సమర్పించిన సమస్యలు, నివేదికలో ఉండకపోవటం దురదృష్టకరం. మేము బలంగా నమ్ముతున్నాం.. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, ఇది ఫిర్యాదులు చేసే సమయం కాదని మాకు తెలుసు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మీ దృష్టికి తీసుకురావటం మా నైతిక బాధ్యతగా భావిస్తున్నాం. మనకు అకస్మాత్తుగా వచ్చిన ఈ ఆపదను, మారిన పరిస్థితులను, అవసరాలను నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా మానవీయంగా కష్టమని మాకు తెలుసు. ఏదేమైనా, వాస్తవాలను దాచడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం హర్షణీయం కాద’’ని అన్నారు.

మరిన్ని వార్తలు