సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

21 Jul, 2020 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 'కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ప్రధాని నరేంద్రమోదీ మీతో మాట్లాడారని తెలిసింది. ఆయనతో సంభాషణలో భాగంగా వంద కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కరోనా నివారణ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇలా చేయడం ద్వంద్వ వైఖరి కాదా..? కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

కరోనా నివారణపై బేషజాలను పక్కనబెట్టి ప్రధాని అన్నిపార్టీలతో మాట్లాడిన విధంగానే మీరు కూడా ప్రతిపక్షాలతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలు ప్రాణాలు రక్షించడం తక్షణ అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవైపు స్వయాన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరును అధికారుల నిర్లక్ష్యాన్ని, ఆస్సత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. (ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది)

న్యాయస్థానమే ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని కోరే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే పరిస్థితులను ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో కోవిడ్‌ విషయంలో మీరు ప్రధానితో వాస్తవపరిస్థితిని తెలిపారో లేదోనని సందేహంగా ఉంది. దయచేసి నిజాలను దాచి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఈ సమయంలో రాజకీయాలకు తావులేకుండా కలిసి కట్టుగా కోవిడ్‌పై పోరాటం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడాలని' లేఖలో పేర్కొన్నారు. (సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌..)

మరిన్ని వార్తలు