కేంద్ర బృందాన్ని తప్పుదోవ పట్టించింది 

3 May, 2020 04:09 IST|Sakshi

మేము అందజేసిన ఆధారాలు, సమస్యలు నివేదికలో లేవు

రాష్ట్రంలో సమీక్షకు మరో బృందాన్ని పంపండి

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి బండి సంజయ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన కేంద్ర ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ లేఖ రాశారు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర యం త్రాంగం ప్రయత్నాలు చేస్తోందని, దానిని హోంశాఖ దృష్టికి తీసుకురావడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కరోనా ప్రభావాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, చికిత్స తీరులను, వైద్య సదుపాయాలను సమీక్షించేందుకు మరొక బృందాన్ని పంపించాలని కోరారు.

నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పత్రికల్లో వచ్చిందని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదన్నారు. 80 ఏళ్ల్ల ఓ వృద్ధుడు కరోనా అనుమానంతో ఏప్రిల్‌ 12న గాంధీ ఆస్పత్రికి వచ్చారని, పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారని, నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆస్పత్రిలో (నిమ్స్‌) పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా ప్రకటించారన్నారు. అనంతరం ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారని, అక్కడే ఆయన ఏప్రిల్‌ 26న మరణించారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఆయన మరణాన్ని చూపించలేదని, ఈ ఉదంతమే ప్రభుత్వ ఉద్దేశా న్ని అనుమానించడానికి అవకాశం ఇస్తోందన్నారు. ఈ సమస్యలన్నింటినీ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లామని, ఆధారాలను అందజేశామని, అయినా అవేవీ బృందం నివేదికలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు