బందూక్‌లో మనోళ్లు

24 Feb, 2015 03:50 IST|Sakshi
బందూక్‌లో మనోళ్లు

కరీంనగర్ అర్బన్ : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బంగారు రాష్ట్రాన్ని ఎలా నిర్మించుకోవాలనే ఇతివృత్తంతో.. పూర్తిగా తెలంగాణ కళాకారులతో తెరకెక్కుతున్న చిత్రం బందూక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మూడు రోజులపాటు కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో జరిగింది. ప్రముఖ కవి గోరటి వెంకన్న రాసిన  పాటను దాదాపు ఇరవై వేల మందితో పతాక సన్నివేశంగా చిత్రీకరించగా, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సహా పలువురు ఉద్యమ, విద్యార్థి సంఘాల నాయకులు నటించారు. అంతేకాదు.. ఈ చిత్రానికి మరో విశేషమూ ఉంది. చిత్ర హీరో చైతన్యది కరీంనగర్ జ్యోతినగర్ కాగా, సిరిసిల్లకు చెందిన రాహుల్ కెమెరామన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
 
అందరూ తెలంగాణవారే..
బందూక్ చిత్రంలో కళాకారులు, సాంకేతికవర్గం అందరూ తెలంగాణకు చెందిన వారేనని దర్శకుడు లక్ష్మణ్‌మురారి తెలిపారు. సోమవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన తాను పద్నాలుగేళ్లుగా సినీపరిశ్రమలో ఉన్నానని చెప్పారు. అసిస్టెంట్ డెరైక్టర్ నుంచి డెరైక్టర్‌గా మారి పలు చిత్రాలు చూపొందించినట్టు చెప్పారు. ఇందులో విశాల్, ఏకవీర, కుర్రాల్లోయ్.. కుర్రాళ్లు.. ఇందు, ఆది పినిశెట్టి వంటి సినిమాలున్నాయని తెలిపారు.

ఉద్యమాలకు పురిగడ్డ కరీంనగర్‌లో షూటింగ్‌కు అందరూ సహకరించారన్నారు. పరీక్షలు పూర్తి అయిన తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. దీనికి నిర్మాతగా గుజ్జ యగంధర్‌రావు వ్యవహరిస్తున్నారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గాయత్రి హీరోరుున్ నటిస్తున్నారు. ఆమె గతంలో ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. ఐస్‌క్రీం-2, జంధ్యాల ప్రేమకథ, కొబ్బరిమట్ట, బొమ్మలరామారం చిత్రాల్లో నటించారు. రెండో హీరోరుున్ హైదరాబాద్‌కు చెందిన షెహరాభాను ఐబీఎం ఉద్యోగిని.  ఆమెకు ఇదే తొలిసినిమా.
 
అమ్మ ప్రోత్సహంతోనే...
మాది సిరిసిల్ల. తల్లిదండ్రులు మాచినేని మృదుల, మోహన్. నాకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో 2011లో బీఎఫ్‌ఏ (బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశాను. మూడు చిన్న సినిమాలైన ప్రయాణికుడు, గీతాలాపన, తిరగబడ్డ తెలంగాణకు కెమెరామన్‌గా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తరువాత మన జిల్లా నుంచి నన్ను కెమెరామన్‌గా తీసుకొని బందూక్ సినిమా షూటింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ కళాకారులతో మరిన్ని సినిమాలకు కెమెరామన్‌గా వ్యవహరించాలనే కోరిక ఉంది. మా అమ్మ మృదుల ప్రోత్సంతోనే ఈస్థాయికి ఎదిగాను.
 - కెమెరామెన్ రాహుల్
 
అదృష్టంగా భావిస్తున్నా..
మాది కరీంనగర్ జ్యోతినగర్. తల్లిదండ్రులు మాదాడి కరుణాకర్, వకుళాదేవి. ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత కొంతకాలం యూఎస్ వెళ్లాను. నాకు చిన్నప్పటినుంచి సినిమాలంటే ఇష్టం. సినిమాలో నటించేందుకు హైదరాబాద్ వచ్చి రామనంద్ వద్ద శిక్షణ పొందాను. రాంచరణ్, నితిన్, నాగచైతన్య వంటి హీరోలు రామనంద్ వద్ద శిక్షణ పొందినవారే. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడిన ఎస్సారార్  గ్రౌండ్‌లోనే హీరోగా యూక్ట్ చేయడం సంతోషంగా ఉంది. బందూక్‌లో హీరో పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
 - హీరో చైతన్య

మరిన్ని వార్తలు