రైతుపై బ్యాంక్‌ ఉద్యోగుల దాడి

8 Jul, 2020 11:51 IST|Sakshi
రైతు అశోక్‌పై దాడి చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

ఇల్లెందు: బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా.. బ్యాంకు ఉద్యోగులు నానా యాగి పెట్టడంతో ప్రశ్నించిన పాపానికి ఓ రైతు మీద బ్యాంకు ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. మండలంలోని పోచారం పంచాయతీ అమర్‌సింగ్‌ తండాకు చెందిన బాధిత రైతు అశోక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 7 నెలల క్రితం అశోక్‌ తండ్రి గుగులోతు భద్రూ ఆంధ్రాబ్యాంక్‌(యూనియన్‌ బ్యాంక్‌)లో నాలుగు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 70 వేలు రుణం తీసుకున్నాడు. ఇంటిలో శుభకార్యం ఉండటంతో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు భద్రూ తన కుమారుడు అశోక్‌తో కలిసి మంగళవారం బ్యాంకుకు  వెళ్లాడు. బంగారం రుణానికి సరిపడా డబ్బులు కూడా చెల్లించారు. అయితే బ్యాంక్‌ అధికా రులు మాత్రం బంగారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినందుకు దూషించారు.

తన తండ్రిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అడ్డు తగిలిన అశోక్‌ తమ బంగారం ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకు ఉద్యోగులను ప్రశ్నించారు. అయితే భూమి పట్టా తీసుకుని రావాలని సమాధానం ఇచ్చారు. బంగారం రుణానికి పట్టాకు సంబంధం ఏంటని తండ్రీ కొడుకులు ప్రశ్నించారు. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కోపంతో.. మీకు చెబితే అర్థ«ం కాదా అంటూ కులం పేరుతో దూషించారు. అక్కడి నుంచి వారిని బయటకు నెట్టుకుంటూ వచ్చారు. మీ పేరుతో ఉన్న పంట రుణం పూర్తిగా చెల్లిస్తేనే బంగారం ఇస్తానని మెలిక పెట్టి బయటకు నెట్టారు. తమ ఇంటిలో శుభకార్యం ఉందని  ఎంత బతిమలాడినా వినకుండా బయటకు నెట్టివేస్తుండగా లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో బ్యాంకు ఉద్యోగులు కృష్ణకాంత్, అంబయ్య, డేవిడ్, రాజు, రాజేష్‌లు బయటకు వచ్చి తన మీద దాడి చేశారని అశోక్‌ తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై బి.రవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతకుముందు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డిని కలిసి జరిగిన సంఘటనపై వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

బ్యాంక్‌ మేనేజర్‌ వివరణ..
బంగారం మీద రుణం చెల్లించినప్పటికీ అతడికి పంట రుణం కూడా ఉందని, మూడేళ్లుగా బాకీ చెల్లించడం లేదని మేనేజర్‌ అంబయ్య తెలిపారు. ఈ విషయమై అతనితో వాగ్వాదం జరిగిందని, కరోనా జాగ్రత్తలు పాటించేందుకుగానూ బయటకు వెళ్లాలని తెలుపగా తమపై దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ క్రమంలో బయటకు నెట్టే క్రమంలో తమ ఉద్యోగి చొక్కా పట్టుకోవడంతో ఆగ్రహంతో దాడి జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు