ఇటు పరిహారం.. అటు రికవరీ!

19 Jun, 2018 13:30 IST|Sakshi

క్రాప్‌లోన్ల కోసం ఖానాపూర్‌ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి

చెక్కులు రాగానే స్వాధీనం చేసుకుంటున్న వైనం

కళ్లతో చూసుకోనివ్వడం లేదని రైతుల ఆవేదన

రెండో విడతలో చెల్లిస్తామంటూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

నిలిచిపోయిన చెక్కుల పంపిణీ

సాక్షి, జడ్చర్ల టౌన్‌ : వారందరూ ముంపు గ్రామాల రైతులు.. ఉన్న పొలం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోల్పోతున్నారు.. అంతకుముందే ఆ భూములపై బ్యాంకులో రుణం తీసుకున్నారు... ఇప్పుడు పరిహారం వస్తున్నందున రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది.. ఇది మొదటి దశేనని, రెండో దశ పరిహారం రాగానే రుణం చెల్లిస్తామని రైతులు చెబుతుండగా.. మొత్తం భూములే కోల్పోతున్నందున రుణం రికవరీ చేసుకునేందుకు తమకు మరో మార్గం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం చెక్కులను కళ్లతోనైనా చూసుకోకుండానే లాక్కోవడం ఎంతవరకు సబబంటూ జడ్చర్ల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. 


273 ఎకరాలకు పరిహారం 
జడ్చర్ల మండలం ఖానాపూర్‌ గ్రామంలో వ్యవసాయ పొలాలు మొత్తం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. నిందులో 273 ఎకరాలకు సంబంధించి రూ.1,49,09,375 పరిహారం విడుదలైంది. ఈ డబ్బుకు సంబంధించి రైతులకు చెక్కులను తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం 75మంది రైతులకు జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో చెక్కులు ఇవ్వగా.. అక్కడకు కారుకొండ కెనరాబ్యాంక్‌ ఇన్‌చార్జి రాజేష్‌ చేరుకుని 12 మంది రైతుల నుంచి చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని.. వారం తర్వాత రుణం పోను మిగతా నగదు తీసుకోవచ్చని తెలిపారు. 


తహసీల్‌ వద్ద ఆందోళన 
ముంపు రైతులు సోమవారం జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో చెక్కులు తీసుకునేందుకు వచ్చారు. అయితే బ్యాంక్‌ ఇన్‌చార్జి రాజేష్‌ వచ్చే వరకు అధికారులు చెక్కులు ఇవ్వలేదు. సదరు అధికారి వచ్చాక చెక్కులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కాగానే.. తనకు అందజేయాలని బ్యాంకు అధికారి కోరాడు. దీంతో రైతులు చెక్కులు తీసుకోకుండా ఆందోళనకు దిగారు. ఇవి మొదటి విడతే అయినందున రెండో విడత చెక్కులు వచ్చాక రుణం చెల్లిస్తామని బదులిచ్చారు. ఇలా ఇరువర్గాల వాదనలతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది.  

1,200ఖాతాలు.. రూ.12కోట్ల రుణం 
నవాబుపేట మండలం కారుకొండ గ్రామంలో కెనరాబ్యాంక్‌ ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిధి లో ఖానాపూర్, కారుకొండ గ్రామాలు ఉన్నా యి. రెండు గ్రామాల్లో 1,200ఖాతాలు రైతులకు సంబంధించి ఉండగా ప్రస్తుతం రూ. 12కోట్ల వ్యవసాయ రుణాలు రికవరీ కావాల్సి ఉంది. వీటిలో సగభాగం ఖానాపూర్‌ గ్రామ రైతులవే. ప్రభుత్వం ఇటీవల కొత్త పాస్‌పుస్తకా లు పంపిణీ చేసినప్పటికీ ఖానాపూర్‌ ముంపుకు గురవుతుండటంతో ఇక్కడ రైతుల కు రాలేదు. ప్రస్తుతం పరిహారం చెక్కులు వస్తుం డడంతో బ్యాంక్‌ అధికారులు తహసీల్‌కు చేరుకున్నారు. అయితే, కలెక్టర్‌తో సంప్రదించి లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌కు ముందుస్తుగా సమాచారం ఇచ్చాకే రికవరీ చేస్తున్నామని  చెబుతున్నారు. 

బలవంతంగా చెక్‌ తీసుకున్నారు 
నాకు మొత్తం రూ.18లక్షల చెక్‌ వచ్చింది. క్రాప్‌లోన్‌ రూ.10వేలు మాత్రమే ఉంది. దీనికోసం నా చెక్‌ మొత్తం తీసుకుని ఖాతాలో జమ చేస్తామంటూ తీసుకున్నారు. నా ఇష్టంతో చెక్‌ ఇవ్వలేదు. ఓ వైపు పొలాలు పోయి బాధలో ఉంటే బ్యాంక్‌ అధికారులు చెక్కులు లాక్కోవటం సబబు కాదు.         – చాకలి చిన్న రాములు, ఖానాపూర్‌ 


కొద్ది మొత్తమే వచ్చింది.
నా భూమి మొత్తం 8ఎకరాలు పోతుంది. అంత భూమికి డబ్బులు రాలే. సగం డబ్బులు అంటే రూ.16.38 లక్షలే వచ్చాయ్‌. నా క్రాప్‌ లోన్‌ రూ.1.10లక్షలే ఉంది. రెండో విడత డబ్బు వచ్చాక రుణం చెల్లిస్తానన్నా వినకుండా చెక్‌ లాగేసుకున్నారు.             – ఊశన్న, ఖానాపూర్‌ 


మేం ఎన్‌ఓసీ ఇస్తేనే పాస్‌ అవుతుంది.. 
ఖానాపూర్‌ రైతుల క్రాప్‌ లో న్‌ బకాయిలు ఇప్పుడు వ సూలు చేసుకోవాల్సిందే. భూములు ముంపునకు గురవుతున్నందున ఆ త ర్వాత వారు రుణం చెల్లించలేరు. ఇన్నాళ్లు సేవలందించిన మా బ్యాంకును కాదని కొందరు రైతులు పరిహారం చెక్కులను ఇతర బ్యాంకుల్లో వేసుకుని డ్రా చేసుకుంటున్నారు. అందుకోసం లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌తో సంప్రదించి ఇకపై మా బ్యాంకు ఎన్‌ఓసీ ఇస్తేనే ఏ బ్యాంకులోనైనా పాస్‌ అయ్యేలా చర్యలు తీసుకోనున్నాం.               – రాజేష్, కెనరా బ్యాంక్‌ ఇన్‌చార్జి, కారుకొండ  

మరిన్ని వార్తలు