రుణమాఫీపై తేలని లెక్క!

30 Aug, 2014 23:44 IST|Sakshi
రుణమాఫీపై తేలని లెక్క!

- బ్యాంకర్ల నిర్వాకంతో డీసీసీ వాయిదా
- లబ్ధిదారుల గుర్తింపులో తీవ్ర జాప్యం
- మ పంచాయతీల్లో జాబితాల ప్రదర్శన ఒట్టిమాటే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతు రుణమాఫీ లెక్క ఇంకా తేలలేదు. బ్యాంకర్ల నిర్వాకంతో అర్హుల జాబితాపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. లబ్ధిదారుల జాబితా ఖరారులో స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోగా జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో చర్చించి తుది జాబితాను తమకు పంపాలని ఆదేశించింది. అయితే, బ్యాంకర్ల అలసత్వంతో అర్హుల జాబితా కొలిక్కి రాలేదు. దీంతో శనివారం జరగాల్సిన డీసీసీ సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది.

ఇంకా చాలా మండలాల్లో లబ్ధిదారుల సమాచారాన్ని స్థానిక తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు బ్యాంకులు అందజే యలేదు. దీంతో గ్రామాల్లో జాబితా ప్రదర్శన దేవుడెరుగు... కనీసం పరిశీలించే పరిస్థితి లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27, 28వ తేదీల్లో అర్హులైన రైతుల వివరాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. అదే సమయంలో సామాజిక తనిఖీలు నిర్వహించి, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించాలి.

ఈ ప్రక్రియ కేవలం మర్పల్లి, యాచారం, మోమిన్‌పేట, తాండూరు, శంకర్‌పల్లి, హయత్‌నగర్, ఘట్‌కేసర్ మండలాల్లోనే పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నా, వీటిలో కూడా జాబితాలను చాలావరకు గ్రామాల్లో ప్రదర్శించకుండా కార్యాలయాల్లో తుదిరూపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
 
2.48 లక్షల మంది రైతులు..
జిల్లావ్యాప్తంగా 2.48 లక్షల మంది రైతులు రూ. లక్ష లోపు పంట రుణాలు, బంగారంపై అప్పులు తీసుకున్నట్లు లీడ్‌బ్యాంక్ ప్రాథమికంగా లెక్కగట్టింది. ఒక కుటుంబంలో రుణమాఫీని లక్ష వరకే పరిమితం చేయడంతో ఈ సంఖ్యకు కోత పడుతుందని అంచనా వేసింది. అదే సమయంలో మొదట అనుకున్నట్లు రూ.900 కోట్ల వరకు రుణ మాఫీ మొత్తంలో కూడా భారీ తరుగుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాను నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ప్రక్రియను చేపట్టిన బ్యాంకులు, జేఎంఎల్‌బీసీ సమావేశాల అనంతరం అర్హుల పేర్లను పంచాయతీల్లో డిస్‌ప్లే చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొదట్నుంచీ రుణమాఫీపై మడతపేచీలు పెడుతున్న బ్యాంకులు తాజాగా జాబితాల రూపకల్పనలో జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివార ం నాటికీ జాబితా ఖరారు కాకపోవడంతో డీసీసీ భేటీ వాయిదాపడింది.
 
సెప్టెంబర్ 4 లేదా 5న డీసీసీ

బ్యాంకులు కాలయాపనతో అర్హుల గుర్తింపు ఆలస్యమైందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. సెప్టెంబ ర్ 2వ తేదీ నాటి కి లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తామని, 4 లేదా 5వ తేదీల్లో డీసీసీ సమావేశం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇదిలావుండగా, లబ్ధిదారుల సమాచారాన్ని రూపొందించడంలో బ్యాంకర్లు అనుసరిస్తున్న వైఖరిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు