బ్యాంకులన్నింటికీ ఒకే టైమ్‌.. 

1 Oct, 2019 09:37 IST|Sakshi
ఆదిలాబాద్‌ శివాజీచౌక్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌

నేటి నుంచి జిల్లాలో అమలు 

ఆర్‌బీఐ నిబంధనలు  సరళీకృతం

వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే..

సాక్షి, ఆదిలాబాద్‌: ఇకనుంచి బ్యాంకులన్నీ ఒకే టైమ్‌కు ఓపెన్, ఒకే సమయానికి క్లోజ్‌ కానున్నాయి. నేటినుంచి ఈ విధానం జిల్లాలో అమలుకానుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యూనిఫాం బ్యాంకింగ్‌ అవర్‌ను జాతీయ, రీజనల్, రూరల్, కోఆపరేటివ్‌ ప్రభుత్వ బ్యాంకులన్నీ అనుసరించనున్నాయి. ఇదివరకు ఆయా బ్యాంకులు తమకు అనువైన సమయాలను నిర్ధారించుకొని అమలు చేసేవి. ఇకపై యూనిఫాం అవర్‌ను పాటించనున్నాయి. 

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గైడ్‌లైన్స్‌ ప్రకారం ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వస్తుంది. ప్రధానంగా ఆర్‌బీఐ మూడు సమయాలను సూచి స్తూ ఆయా ప్రాంతాలకు అనువుగా ఆ సమయాలను నిర్ధారించుకోవాల్సిందిగా పేర్కొంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు సమయాలను సూచించింది. ఈమేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నుంచి ఆయా జిల్లాలకు అనువైన సమయం ఎంచుకోవాలని కోరింది. ఈ మేరకు జిల్లాలో గత ఆగస్టు 29న జిల్లా కన్సల్టేటివ్‌ కమిటీ (డీసీసీ) చైర్మన్‌ అయిన జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధ్యక్షతన ఎల్‌డీఎం చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రతిబ్యాంక్‌కు సంబంధించిన చీఫ్‌ మేనేజర్లు, ఏజీఎంలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈమేరకు జిల్లాలో ఒక సమయం నిర్ధారించి దాన్ని ఎస్‌ఎల్‌బీసీకి పంపడంతో ఆమోదం తెలిపింది. 

వినియోగదారులకు అనువుగా.. 
వినియోగదారులకు అనువుగా ఉండాలని డీసీ సీ ఒక నిర్ధారిత సమయాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు అనువుగా ఉండేలా సమయాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా బ్యాంక్‌ లావాదేవీలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంక్‌ సమయాలపై గందరగోళం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహద పడనుంది.

సరళీకృతం చేయడం జరుగుతుంది
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని ప్రభుత్వ బ్యాంకులన్నింటికీ సంబంధించి సమయాన్ని సరళీకృతం చేస్తుంది. అందులో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నాం. బ్యాంక్‌ వర్గాలు తప్పనిసరిగా ఈవిధానం పాటించాలి.  – చంద్రశేఖర్, ఎల్‌డీఎం, ఆదిలాబాద్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా