అనుమతి ఐదుగురికే..

16 Apr, 2020 01:46 IST|Sakshi
బుధవారం హైదరాబాద్‌లోని శాలిబండలో ఓ బ్యాంకు వద్ద బారులు తీరిన జనం

కరోనా నేపథ్యంలో బ్యాంకు నిబంధనలు కఠినతరం 

జన్‌ధన్, రేషన్‌కార్డు ఖాతాదారుల రాకతో భారీగా క్యూలైన్లు 

నగదు ఉపసంహరణకు ఒక్కసారిగా పోటెత్తిన ఖాతాదారులు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు నిబంధనలను కఠినతరం చేయడంతో ఖాతాదారులు ఇబ్బందులుపడ్డారు. పెద్దసంఖ్యలో ఖాతాదారులు నగదు ఉపసంహరణకు బ్యాంకులకు రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఒక్కో దఫాలో ఐదుగురు ఖాతాదారులను మాత్రమే లోనికి అనుమతిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వరుసగా సెలవులు రావడంతో సాధారణ ఖాతాదారుల రాకపోకలు పెరిగాయి. గత శుక్ర, శని, ఆదివారాలతో పాటు మంగళవారం బ్యాంకులకు సెలవు కావడంతో బుధవారం ఏ బ్యాంకు వద్ద చూసినా క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. లాక్‌డౌన్‌ కాలంలో పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులతో నెట్టుకొస్తున్న బ్యాంకుల్లో విత్‌డ్రాయల్స్‌ తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల జన్‌ధన్‌ ఖాతాదారులకు మొదటి విడతగా రూ.500 చొప్పున ఆర్థిక సాయం జమచేసింది. మరోవైపు తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామ ని ఇదివరకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందు లో భాగంగా రెండ్రోజుల క్రితం దాదాపు 70 లక్షల మంది ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసింది. 

క్కసారిగా రావడంతో.. 
బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, ఈ సమయంలోనే తెల్లరేషన్‌ కార్డుదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడంతో బ్యాంకుల్లో ఖాతాదారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచే పలువురు బ్యాంకుల వద్దకు చేరుకుని క్యూలో నిలబడ్డారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నట్లు బ్యాంకులు బోర్డులు ఏర్పాటు చేశాయి. దీంతో బ్యాంకు సమయం ముగిసే వరకు పరిమితి ఆ«ధారంగా లబ్ధిదారులకు నగదు ఉపసంహరణకు అనుమతిచ్చారు. క్యూలైన్లలో ఎక్కువ మంది ఉండడంతో కొందరు నగదును తీసుకోకుండానే వెనుదిరిగారు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం బ్యాంకులో జమకావడంతో ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చు. అయితే చాలామంది ఖాతాదారులకు ఏటీఎంలు లేవు. బ్యాంకులు ఏటీఎం కార్డులు జారీ చేసినా.. పలువురు కార్డు పిన్‌ నంబర్‌ను జనరేట్‌ చేసుకోలేదు. ఫలితంగా బ్యాంకుకు వెళ్లి మాన్యువల్‌ పద్ధతిలో నగదు తీసుకోవాల్సి వస్తోంది. 

బ్యాంకుల్లో నిబంధనలు కఠినం 
కరోనా కట్టడికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు బ్యాం  కులతో ముడిపడి ఉండడంతో కఠిన నిబంధనలను తెచ్చింది. ఈ క్రమంలో ఒక బ్యాంకు బ్రాంచి లో ఒక దఫా ఐదుగురు ఖాతాదారులకే ప్రవేశం కల్పించాలని స్పష్టంచేసింది. వారి లావాదేవీలు పూర్తయ్యాకే మరికొందరిని అనుమతించాలని, ఈ నిబంధనలతో భౌతిక దూరం పాటించినట్లవుతుందని పేర్కొంది. బ్యాంకులోకి ప్రవేశించే వ్యక్తి పేరు, ఫోన్‌ నంబర్, బ్యాంకుకు వచ్చిన కారణాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించింది. ఒకవేళ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే జాగ్రత్తలు తీసుకోవడం సులభమవుతుందనే యోచనతో ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. బ్యాం కులోకి వచ్చే ముందు శానిటైజర్‌తో చేతులు శు భ్రం చేసుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని బ్యాంకు శాఖలకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల నేపథ్యంలోనే ప్రస్తుతం బ్యాంకుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఖాతాదారులకు సేవలందుతున్నాయి. దీంతో రద్దీ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు