'బవొబాబ్‌' 500 ఏళ్లు

31 Aug, 2019 10:49 IST|Sakshi
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని బవొబాబ్‌ చెట్టు

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మడగాస్కర్‌ వృక్షం

ఇలాంటివి దేశంలో 38 చోట్ల మాత్రమే..

రాయదుర్గం: భౌగోళిక వాతావరణాన్ని బట్టి కొన్ని చెట్లు కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ముఖ్యంగా మధ్య ఆఫ్రికాలో ఉండే వాతావరణం, మట్టి మరో ఖండంలోగాని, దేశంలోగాని కనిపించవు. అక్కడ పెరిగే చెట్లు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ‘మడగాస్కర్‌ ట్రీ’గా పేరు పొందిన ‘బవొబాబ్‌’ ఎంతో ప్రత్యేకం. ఇవి బయటి ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదే. ఈ మహా వృక్షాలు ఆస్ట్రేలియాలో రెండు చోట్ల కనిపిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం దాదాపు 38 ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. పైగా ఈ అరుదైన వృక్షాలు నగరంలోనే నాలుగు ఉన్నాయి. అందులో ఒకటి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని
అమర్‌రాజా భవనం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ పక్కనే నిర్మిస్తున్న భవన ప్రాంగణంలో ఉంది. దీని వయసు దాపు 500 ఏళ్లకు పైగానే ఉండడం విశేషం. 

కాండం నిండా నీరే...
సాధారణంగా ఎచెట్టయినా కాలానుగుణంగా ఆకులు రాలుస్తుంది. కానీ బవొబాబ్‌ చెట్టుకు మాత్రం ఆకులు రాల్చడం చాలా అరుదు. ప్రాంతాన్ని బట్టి ఈ చెట్టుకు చాలా పేర్లే ఉన్నాయండోయ్‌. ‘బాటిల్‌ ట్రీ, ది ట్రీ ఆఫ్‌ లైఫ్, అప్‌సైడ్‌డౌన్‌ ట్రీ, మంకీబ్రీడ్‌ ట్రీ, హతీజాడ్‌’ వంటి పేర్లతో పిలుస్తుంటారట. ఇది దాదాపు 30 మీటర్ల వరకు పెరుగుతుంది. అంతేకాదు.. ఇవి వేల సంవత్సరాలు బతుకుతాయి కూడా. ఈ వృక్షం కాండంలో సుమారు 1,20,000 లీటర్ల నీరు ఉంటుందని అంచనా. ఈ చెట్టుకు అరుదుగా కాసే కాయలు కొబ్బరి బొండాం తరహా ఉంటుంది. 

మడగాస్కర్‌ జాతీయ వృక్షం ఇదే..  
హిందూ మహాసముద్రంలో గల మడగాస్కర్‌ దేశం జాతీయ వృక్షంగా ఈ బబొబాట్‌ వృక్షం గుర్తింపు పొందింది. వీటిలో తొమ్మిది రకాల జాతులు ఉన్నాయి. అందులో ఆరు రకాలు మడగాస్కర్‌ ప్రాంతంలో ఉండగా, రెండు రకాలు ఆఫ్రికాలోను, ఒక రకం ఆస్ట్రేలియా, మూడు రకాలు మన దేశంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికాలో ఈ చెట్టు బెరడును సబ్బులు, మందుల తయారీలోనూ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. 

మన రాష్ట్రంలో ఆరు చోట్ల
చారిత్రక ఆధారాల ప్రకారం మనదేశంలో ఈ వృక్షాలు 38 చోట్ల మాత్రమే పెరుగుతున్నట్టు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు చోట్ల ఈ వృక్షాలు ఉండగా.. అందులో నాలుగు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉండడం విశేషం. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఒకటి ఉండగా.. అత్తాపూర్, వనస్థలిపురం, చప్పల్‌రోడ్‌కు సమీపంలో, చెంగిచెర్ల రిజర్వు ఫారెస్ట్‌లోను, నల్గొండ జిల్లా బాలచంద్రునిగుట్టపై శివాలయం సమీపంలో ఈ వృక్షాలు ఉన్నట్టు వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో అమర్‌రాజా భవనం ఎదురుగా ఉన్న వృక్షం వయసు సుమారు 500 ఏళ్లుగా అంచనా వేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రంగనాథస్వామి దేవాలయం మాత్రమే ఉండేది. నగరీకరణ నేపథ్యంలో ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ అరుదైన వృక్షం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ మడగాస్కర్‌ చెట్టు కనిపిస్తున్నా భవిష్యత్‌పై మాత్రం అనుమానం వ్యక్తమవుతోంది. ఈ అరుదైన వృక్ష జాతిని పరిరక్షించి, భావి తరాలకు అందించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు