నగరానికి రేడియేషన్‌

1 Sep, 2019 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కళ్ల మంటలు, త్వరగా అలసిపోవడం, తెల్లరక్త కణాలు తగ్గడం, జట్టు రాలడం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లాంటి సమస్యలు నగరజీవికి సాధారణమయ్యాయి. ఇంట్లో ఉండే వారి కంటే వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న వారిలో ఇది ఎక్కువ. ఇలాంటి సమస్యలకు రేడియేషన్‌ కూడా ఓ కారణమంటోంది బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌). తాజాగా బార్క్‌ చేపట్టిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు తేలాయి. దక్కన్‌ పీఠభూమిలో అనేక భౌగోళిక ప్రత్యేకతలున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఇటీవలి కాలంలో రేడియేషన్‌ (వికిరణ తీవ్రత) అధికంగా నమోదవుతున్నా దీన్ని శాస్త్రీయంగా లెక్కించే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

గతేడాది గ్రేటర్‌ పరిధిలో రేడియేషన్‌ తీవ్రతపై బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఏటా 2 మిల్లీసీవర్ట్స్‌ (రేడియేషన్‌ కొలిచే ప్రమాణం) మేర నమోదవుతున్నట్లు తేలింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ తీవ్రత ఏటా 1 మిల్లీ సీవర్ట్స్‌కు మించరాదు. కాగా ఈ రేడియేషన్‌ తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించేందుకు ఎన్విరాన్‌మెంటల్‌ రేడియేషన్‌ మానిటర్స్‌ (ఈఆర్‌ఎం)ను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బార్క్‌ పరిశోధన సంస్థ పీసీబీకి సూచించినా ఫలితం లేదు. హైదరాబాద్‌తోపాటు పలు మెట్రో నగరాల్లో ఇటీవల రేడియేషన్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోందని బార్క్‌ అధ్యయనంలో తేలింది.  

రేడియేషన్‌ పెరుగుతోంది ఇలా..
దక్కన్‌ పీఠభూమిలో సముద్ర మట్టానికి సుమారు 536 మీటర్ల ఎత్తున ఉన్న హైదరాబాద్‌లో గ్రానైట్, బాసాల్ట్, గోండ్వానా శిలా స్వరూపాలు అత్యధికంగా ఉండటమూ వాటి నుంచి వెలువడే వికిరణాలు సైతం రేడియేషన్‌ పెరిగేందుకు ఒక కారణం. పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాల వినియోగం పెరగడం, కాలం చెల్లిన వాహనాలు వాడకం, పరిశ్రమల కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరోవైపు భూమి పైపొరలపై విశ్వకిరణాలు (కాస్మిక్‌ కిరణాలు) పడుతుండటం, సిటీ కాంక్రీట్‌ జంగిల్‌లా మారడంతో భూమి వాతావరణం నుంచి వికిరణ తీవ్రత పైకి వెళ్లే దారులు లేక, హరిత వాతావరణం తగ్గడంతో రేడియేషన్‌ తీవ్రత పెరుగుతోందని తేలింది.

విముక్తి ఇలా... 
గ్రేటర్‌ పరిధిలో 8 శాతం మేర ఉన్న హరిత వాతావరణాన్ని 30 శాతానికి పెంచాలి. ప్రతి ఇళ్లు, కార్యాలయం, గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటాలి. ఎక్కువ సేపు మోటారు వాహనాల కాలుష్యాన్ని పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం కూడా రేడియేషన్‌ తీవ్రత బారిన పడకుండా కాపాడుతుంది. ఇక పీసీబీ సైతం ఎన్విరాన్‌మెంటల్‌ రేడియేషన్‌ మానిటర్స్‌ను ఏర్పాటు చేసి తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించడంతోపాటు నివారణ చర్యలను చేపట్టే అంశంపై బల్దియా యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి.

రేడియేషన్‌ అధికంగా ఉన్న ప్రాంతాలు... 

  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, మసాబ్‌ట్యాంక్, నాచారం, జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, పాశామైలారం, కుత్బుల్లాపూర్‌

అనర్థాలు ఇలా..

  • చర్మం, కళ్ల మంటలు, ఉక్కపోతతో సతమతం. 
  • త్వరగా అలసిపోవడం, తలనొప్పి, గుండెకొట్టుకునే వేగం పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. 
  • డయేరియా, వాంతులు, జుట్టు రాలడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి.  
మరిన్ని వార్తలు