ఇప్పుడైనా ఆర్డీఎస్‌కు నీరందేనా..?

22 Jun, 2015 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)తో రాష్ట్రానికి రావాల్సిన వాస్తవ నీటి వాటాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీతో ఉన్న వివాదాన్ని కేంద్ర సహకారంతో చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన రాష్ట్రం.. వాటా మేరకు నీటిని వినియోగంలోకి తెచ్చి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరిచ్చే యత్నాలకు పూనుకుంది. కేంద్రం ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ఏపీ సహకారం అందిస్తే ఆర్డీఎస్ కింద బ్యారేజీ నిర్మించి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే దిశగా కసరత్తు చేస్తోంది.

అవసరమైతే దీనిపై మరోమారు ఏపీతో, కర్ణాటకతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించినమేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక అంగీకరించింది.

అలాగే కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ర్టం రూ.72 కోట్ల మేర డిపాజిట్  కూడా చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండడంతో 4 టీఎంసీలు మాత్రమే రాష్ట్రానికి అందుతున్నాయి. దీంతో 37 వేల ఆయకట్టుకు  సాగునీరందుతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం దృష్టికి తీసుకురాగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకు తాము సహకరిస్తామని ఏపీ స్పష్టం చేసింది.
 
బ్యారేజీ నిర్మిస్తే మేలంటున్న తెలంగాణ..
ఆర్డీఎస్ కింద ఉన్న నీటి కేటాయింపులను వాడుకునేందుకు బ్యారేజీ నిర్మిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీ అయితేనే లక్ష్యం మేర ఆయకట్టుకు నీటిని అందించవచ్చని చెబుతోంది. బ్రజేష్ ట్రిబ్యునల్ సైతం కొత్తగా తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనం గా ఏపీలోని కేసీ కెనాల్‌కు కేటాయించిన దృ ష్ట్యా, ఆ నీటిని ఈ బ్యారేజీ ద్వారా అందించవచ్చు. బ్యారేజీ నిర్మాణంలో ఏపీ సైతం భాగస్వామ్యం కావాలని రాష్ట్రం అంటోంది.

>
మరిన్ని వార్తలు