టీఎస్‌ సెట్‌ ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి

23 Sep, 2017 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్ల భర్తీ, పదోన్నతుల నిమిత్తం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష 2017 (టీఎస్‌ సెట్‌) ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఫలితాలను వెల్లడించద్దంటూ ఉస్మానియా వర్సిటీని ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 7న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ ఉత్తర్వులిచ్చారు.

టీఎస్‌ సెట్‌ నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉన్న విధివిధానాలను పరీక్ష పూర్తయిన తరువాత మార్చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ రీసెర్చ్‌ స్కాలర్‌ ఏల్చల దత్తాత్రీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఫలితాల వెల్లడిపై స్టే విధించింది. ఇటీవల ఉస్మానియా వర్సిటీ ఈ స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి... గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణను వాయిదా వేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు