‘కాళేశ్వరం’ అడ్డంకులు తొలగిపోయాయి

25 Nov, 2017 02:55 IST|Sakshi
నారాయణఖేడ్‌లో రైతుబజార్‌ను ప్రారంభించి రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

 అటవీ భూములకు ఢిల్లీ అనుమతులు: మంత్రి హరీశ్‌రావు  

నారాయణఖేడ్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 78 ఎకరాల అటవీభూముల సమస్య పరిష్కారమైందని, ఢిల్లీ నుంచి క్లియరెన్స్‌ వచ్చిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు రావడంతో మంజీరా నదిని గోదావరి నీటితో నింపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నారాయణఖేడ్‌లో ఉల్లి రైతుల కోసం గోడౌన్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మార్కెటింగ్‌ శాఖ ద్వారా 50 శాతం సబ్సిడీ అందజేసి చిన్న గోడౌన్లను నిర్మింపజేస్తామని, ఇక్కడ గోడౌన్లు విజయవంతమైతే రాష్ట్రం మొత్తం నిర్మిస్తామన్నారు. ఉల్లి పంట అమ్ముకొనే సమయంలో ధరలు తగ్గి 3 నెలల తర్వాత ధరలు పెరిగి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ ఇబ్బందుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు గోడౌన్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. మొదటగా 200 మంది రైతులకు ఈ గోడౌన్లను ఇస్తామన్నారు. అవసరమైతే 2 వేల మందికి ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. ‘మిషన్‌ భగీరథ’పనులు పూర్తవుతున్నాయని, కొత్త సంవత్సరంలో ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, గృహావసరాలు, కర్మాగారాలకు విద్యుత్‌ సమస్య తీరిందని, 24 గంటలపాటు కరెంట్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు