చికిత్స పొందుతూ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి 

7 Feb, 2020 10:16 IST|Sakshi

సాక్షి, జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామానికి చెందిన బోండ్ల సంజయ్‌ అనే ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి గురువారం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంజయ్‌ నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో బుధవారం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కళాశాలలో సంజయ్‌ మరో విద్యార్థి సాయిచరణ్‌లు ఘర్షణ పడ్డారు. ఈ విషయంలో సాయిచరణ్, సంజయ్‌పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు వీరిని ప్రత్యేక గదిలో ఉంచారు. బుధవారం ఉదయం సంజయ్‌ను విచారించే సమయంలో మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది చికిత్స కోసం తొలుత నిజామాబాద్‌లోని ప్రగతి ఆస్పతికి తరలించారు. తర్వాత సంజయ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా గురువారం మధ్యాహ్నం సంజయ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

విషాదంలో కుటుంబం  
కొలిప్యాక్‌ గ్రామానికి చెందిన బోండ్ల శ్రీనివాస్, సత్తెమ్మల కుమారుడు సంజయ్‌. నిర్మల్‌లోని బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. శ్రీనివాస్‌ గీత కార్మికుడిగా పని చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి సత్తె మ్మ బీడీలు చుడుతుంది. సంజయ్‌ను ఎలా గైనా బాగా చదివించాలని ఆశించారు. అనుకోకుండా సంజయ్‌ ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. సంజయ్‌ అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు