ఎలక్ట్రిక్‌ బైక్‌పై రయ్‌రయ్‌!

6 Sep, 2019 12:13 IST|Sakshi

బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ప్రతిభ

గంట చార్జింగ్‌తో 30 కిలోమీటర్ల ప్రయాణం

సాక్షి, బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ–4 మెకానికల్‌ విభాగానికి చెందిన జి. విశాల్, జే. మహేశ్‌లు ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారుచేశారు. పెట్రోల్, డీజిల్‌ అవసరం లేకుండా పర్యావరణ హితాన్ని కోరుతూ ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీ వైపు అడుగులువేశారు. విద్యుత్‌ చార్జింగ్‌తో పనిచేసే బైక్‌ తయారీకి రూ. 40వేల మేర ఖర్చుపెట్టారు. కళాశాలలో తోటి విద్యార్థుల ఆలోచనలతో తుదిరూపాన్ని ఇచ్చారు. గంట చార్జింగ్‌తో 30 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా బైక్‌ను రూపొందించారు. పాత ద్విచక్రవాహనాల విడి భాగాలతో పెట్రోల్‌ అవసరంలేని బైక్‌ను ఆవిష్కరించారు. 

ఆలోచనలు పంచుకుంటూ..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం సంఘం జాగర్లముడి గ్రామానికి చెందిన జి. విశాల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన జే. మహేశ్‌ బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ–4 చదువుతున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు తమ ఆలోచనను ప్రొఫెసర్‌ కె. మహేశ్, సీనియర్లు ఎం. సంపత్‌కుమార్, డి. వినోద్, కె.సాయిదీప్, జి.ప్రశాంత్, జి. వేణుగోపాల్‌రావు, ఎం.రాకేశ్‌ల సలహాలతో రూ. 40వేలు ఖర్చుచేసి పాతబైక్, ఇతర ఎలక్ట్రిక్‌ సామాగ్రితో కొత్త బైక్‌ తయారు చేశారు, సొంత ఆలోచనలకు కళాశాల ప్రొఫెసర్, సీనియర్‌ విద్యార్థుల సలహాలు తోడుకావడంతో కాలుష్యాన్ని నివారించేలా ట్రిపుల్‌ఐటీలోనే ఎలక్ట్రికల్‌ బైక్‌ తయారైం ది. ఈ బైక్‌లో ఇంజన్‌ ఆయిల్, గేర్‌ ఆయిల్‌ మా ర్పించాల్సిన అవసరం రాదని, కేవలం బ్యా టరీలు అందులో ఉండే యాసిడ్‌ వాటర్‌ సరిచేసుకుంటేసరిపోతుందని విద్యార్థులు తెలిపారు. 

కంపెనీ తోడైతే...
విద్యార్థుల ఆలోచనకు ఏదైన కంపెనీ తోడైతే ఇక్కడే ఎలక్ట్రిక్‌ బైక్‌లను తయారు చేయవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో రూ. 10 వేలు ఖర్చుచేస్తే ఈ బైక్‌ కొత్తలుక్‌లో కనిపిస్తుంది. రూ. 50 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌ రూపొందుంతుందని అంటున్నారు. 

ప్రకృతికి ఎంతో మేలు 
ఎలక్ట్రిక్‌ బైక్‌తో ప్రకృతికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ వాహనం నుంచి విషవాయువులు ఉత్పత్తికావు. శబ్దం కూడా వెలువడదు. దీంతో ధ్వని కాలుష్యం కూడా ఉండదు.      
–జి. విశాల్, విద్యార్థి

డబ్బు ఆదా అవుతుంది  
సీనియర్‌ల సలహాలతో రూ. 40వేలు వెచ్చించి ఎలక్ట్రిక్‌బైక్‌ను తయారుచేశాం. ఈ చార్జింగ్‌ బైక్‌తో వాహనదారులకు డబ్బులు ఆదా అవుతాయి. ఒక గంట చార్జింగ్‌తో 30 కిలోమీటర్లు తిరగవచ్చు. 
–జె. మహేశ్, విద్యార్థి  

మరిన్ని వార్తలు