సమస్యల ఒడిలో గురుకుల బడి

6 Aug, 2014 02:44 IST|Sakshi

కీసర: ఒకప్పుడు ఆదర్శ విద్యాలయంగా పేరు సంపాదించిన ఆ గురుకుల పాఠశాల నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగాల్సి ఉండగా అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో 1978లో కీసరగుట్టలో గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు.

అందుకు తగ్గట్టుగానే మొదట్లో సకల సౌకర్యాలతో అత్యుత్తమ బోధనతో ఆదర్శ గురుకుల విద్యాలయంగా పేరు గడించింది. రానురాను పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం కల్పించిన సౌకర్యాలు తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదు. ఒకప్పుడు ఐదు నుంచి పదో తరగతి వరకు 500 నుంచి 600 వరకు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 370 మంది విద్యనభ్యసిస్తున్నారు.

 ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ఏళ్లక్రితం విద్యార్థులకోసం నిర్మించిన ఐదు డార్మెంట్ హాళ్లు అధ్వాన స్థితికి చేరాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా  విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు రాత్రి వేళ పడరానిపాట్లు పడుతున్నారు.  

దోమలు, ఈగల బాధకు తోడు చలికాలం, వర్షకాలంలో కంటికి కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

గతంలో విద్యార్థులకోసం ఇచ్చిన మంచాలు తుప్పుపట్టి పోవడంతో మూలన పడేశారు. వాటిస్థానంలో ఇప్పటి వరకు కొత్తవి మంజూరు కాకపోవడం విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సి వస్తోంది.

ఇక పాఠశాలకు పక్కా ప్రహరీ లేకపోవడం కుక్కలు, పందులు, పశువులు పాఠశాల ఆవరణలోనే తిరుగుతున్నాయి.

విషసర్పాలు డార్మింట్ రూమ్ సమీపంలోనే సంచరిస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

డైనింగ్‌హాల్ సమీపంలోనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి.

సరైన బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు లేకపోవడం విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం చేస్తున్నారు.  

మంచినీటి సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాఠశాలలో ఒకే ఒక్కబోరు ఉండటంతో నీటికోసం ప్రతిరోజు  ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న ఒక్కబోరు చెడిపోతే విద్యార్థులు స్నానాలకోసం కీసరగుట్ట వేదపాఠశాల, పార్కు, టీటీడీ ధర్మశాల వద్దకు బకెట్లు పట్టుకొని పరుగులు తీయాల్సిందే.

ఇక డైనింగ్‌హాల్, వంటగదిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు భోజనపాట్లు అదనంగా తోడయ్యాయి.

పేరుకే గురుకుల పాఠశాల అయినా కనీసం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న కొద్దిపాటి వసతులు కూడా విద్యార్థులకు అందడం లేదు.

 అమ్మో ఆ స్కూలా..!
 ఒకప్పుడు ఇక్కడి పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపేవారు. నేటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండడానికి, చదవడానికి జంకుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని విద్యార్థులు.. తమ పిల్లలను ఎందుకు పంపించామా అని తల్లిదండ్రులు ఆవేదన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సంవ త్సరాలుగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇక్కడ చదవలేక వెనుదిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వికారాబాద్ ఆలంపల్లికి చెందిన విఘ్నేశ్వర్‌రెడ్డి ఐదో తరగతిలో అడ్మిషన్ పొంది వారం రోజులు తిరక్కముందే ఇక్కడి పరిస్థితులు చూసి మంగళవారం వెనుదిరిగాడు.

 ఈ మేరకు విద్యార్థితండ్రి మహిపాల్‌రెడ్డి  పాఠశాల దయనీయ పరిస్థితులను స్వయంగా కలెక్టర్‌కు తెలియజేశారు. తమ బిడ్డను కూలీనాలి చేసైనా ఎక్కడైనా చదివిస్తాను తప్ప ఈ గురుకుల పాఠశాలలో మాత్రం చదివించనని స్పష్టం చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కీసరగుట్ట గురుకులాన్ని జిల్లాలోనే ఆదర్శపాఠ శాలగా తీర్చిదిద్దుతామని దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు గుప్పిస్తున్నా  కార్యరూపం దాల్చలేదు. పూర్వ విద్యార్థులు అడపాదడపా విరాళాలు ఇస్తున్నా లెక్కలేకుండాపోయింది. విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి పాఠశాలకు పూర్వవైభవం తేవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు