వారంలోగా ప్రాథమిక జాబితా!

3 Jan, 2019 01:41 IST|Sakshi

1:2గా టీజీటీ, పీజీటీ జాబితాను ప్రకటించనున్న టీఆర్‌ఈఐఆర్‌బీ 

నెలాఖరులోగా నియామకాల ప్రక్రియ పూర్తికి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టులకు సంబంధించి ప్రాథమిక జాబితా సిద్ధమైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను ఇప్పటికే విడుదల చేసిన గురుకుల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) తాజాగా ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) కేటగిరీల వారీగా ప్రాథమిక జాబితాను వారంలోగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జాబితాను 1:2 ప్రకారం ప్రకటించనుంది. ఇప్పటికే అభ్యర్థుల మార్కుల జాబితాను బోర్డు ప్రకటించినప్పటికీ అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యం చేసింది.

తాజాగా నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు వేగిరం చేసింది. ఈక్రమంలో మార్కుల జాబితాను వడపోసిన యంత్రాంగం..ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను గుర్తిస్తూ జాబితాను తయారు చేసింది. జాబితా వెల్లడించిన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం ఉద్యోగాలకు నియమితులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం తుది జాబితా వెల్లడించేందుకు మరో వారం రోజుల  సమయం పడుతుందని, ఎంపిక ప్రక్రియ అంతా ఈనెలాఖరులోగా  పూర్తవుతుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు