33 అడుగుల బతుకమ్మ

29 Sep, 2017 02:06 IST|Sakshi

కూసుమంచి(పాలేరు): సద్దుల బతుకమ్మ సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో 33 అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, సీడీసీ చైర్మన్‌ జూకూరి గోపాలరావు, ఆయన సతీమణి, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అతి పెద్ద బతుకమ్మను పేర్చారు. గతేడాది కూడా ఈ దంపతులు 15 అడుగుల బతుకమ్మను పేర్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా, ఈ సంవత్సరం పేర్చిన బతుకమ్మ రాష్ట్రంలో పెద్దది కావచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.

 

7.25 క్వింటాళ్ల పూలు..
72 మంది మనుషులు..
ఈ భారీ బతుకమ్మను పేర్చేందుకు గోపాలరావు దంపతులు 7.25 క్వింటాళ్ల పూల (గులాబీ, బంతి, టేకు, తంగేడు, గునుగు)తో పాటు మరో 10 కిలోల డెకరేషన్‌ పూలను వినియోగించారు. భారీ ట్రాక్టర్‌ ట్రాలీపై ఈ బతుకమ్మను 72 మంది 12 గంటలు శ్రమించి పేర్చారు. బతుకమ్మ కింది భాగం ఆరు అడుగుల వెడల్పుతో ప్రారంభం కాగా, చివరన అడుగున్నరతో ముగిసింది. ఈ బతుకమ్మ చివర దుర్గాదేవి, ఆంజనేయస్వామి ప్రతిమలను ఏర్పాటు చేశారు. తాము బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటామని, తెలంగాణలో బతుకమ్మ విశిష్టతను చాటిచెపుతూ తమ గ్రామానికి పేరు తీసుకొచ్చేలా ఈ భారీ బతుకమ్మను పేర్చామని గోపాలరావు దంపతులు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు