ధైర్యం చెబుతూ.. స్ఫూర్తి నింపుతూ...

8 Oct, 2018 09:51 IST|Sakshi

బతుకమ్మ సందర్భంగా వినూత్న రోడ్‌ షో

తొమ్మిది రోజుల పాటు తొమ్మిది జిల్లాలు

సాక్షి సిటీ బ్యూరో: హైదరాబాద్‌ బైకర్నీ గ్రూప్‌.. 2013లో ప్రారంభమైన ఈ గ్రూప్‌ ఎన్నో సాహసోపేతమైన బైక్‌ యాత్రలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కర్దుంగ్లా యాత్రతో పాటు, 56 రోజుల పాటు 17వేల కిలోమీటర్ల మీకాంగ్‌ యాత్ర ఇలా అనేక సాహస బైక్‌ యాత్రలు ఈ గ్రూప్‌ తన ఖాతాలో జమ చేసుకుంది. తమ బైక్‌ యాత్రల ద్వారా అనేక మంది స్త్రీలలో ధైర్యం, స్ఫూర్తి నింపుతున్న ఈ గ్రూప్‌ ఈ బతుకమ్మ పండుగకు ఒక వినూత్న రైడ్‌ చేపట్టనుంది.

జయభారతి నేతృత్వంలో 9 మందితో కూడిన బైకర్నీల బృందం 9వ తేదీన హైదరాబాద్‌ నుంచి తమ యాత్ర ప్రారంభించనుంది.  తొమ్మిది రోజుల పాటు తొమ్మిది జిల్లాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొననుంది. సంబరాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీల భద్రత, సాధికారికతపై రోడ్‌ షోలు చేపట్టి వారితో ముచ్చటించనుంది. ఈ రైడ్‌లో మరింత ఆసక్తికర అంశం,  వీరంతా తెలంగాణా చేనేత దుస్తులను ధరించి ఈ రైడ్‌ నిర్వహిస్తున్నారు. షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో  నిర్వహించే  ఈవెంట్లలో  బైకర్నీలు పాల్గొంటారు.  

చైతన్యపరుస్తాం
నాతో పాటు ఈ రైడ్‌లో శాంతి, సురేఖ, కాత్యాయినీ, సత్యవేణి, హంస, కవిత, సుష్మ, పూర్ణిమ ఉంటారు.సాయంత్రానికి మేం చేరుకున్న జిల్లాల్లో  బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంకోచం లేకుండా షీ టీమ్స్‌ని సంప్రదించ వచ్చని వారి సేవలు ఎలా పొందవచ్చనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తాం. తెలంగాణ  రోడ్, బైక్‌ ద్వారా ట్రావెల్‌ చెయ్యడానికి సురక్షితమైంది అందుకు మా యాత్రలే ఉదాహరణ. అలాగే చేనేత వస్త్రాలు రోజువారిగా వాడుకలో భాగం చెయ్యాలని చెప్తాం.   చివరి రోజు హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహిస్తాం.       – జయభారతి 

మరిన్ని వార్తలు