20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు

8 Sep, 2017 07:40 IST|Sakshi
20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు

ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌:
బతుకమ్మ వేడుకతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రక టించి మూడేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయా లని భావిస్తోంది. బతుకమ్మ వేడుకకు అంతర్జా తీయంగా గుర్తింపు తెచ్చేందుకు రెండేళ్లుగా కృషి చేస్తోంది. ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలను పెద్దఎత్తున నిర్వహిం చటం ద్వారా ఈసారైనా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభు త్వ ప్రధానకార్యదర్శి ఎస్పీసింగ్‌ గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న దాదాపు 35 వేల మంది మహిళలతో సామూహికంగా ఎల్బీ స్టేడియంలో ‘‘బతు కమ్మ ఉత్సవం’’నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బతుకమ్మలను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం కల్పించా లన్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్‌ ప్రణాళిక రూపొందిం చాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిం చారు. జిల్లాలలో కూడా ఘనంగా నిర్వహిం చేందుకు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వ హించాలని సూచించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలతోపాటు విదేశీ నగరాల్లో కూడా పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశంను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి వేడుకలు మరింత ఉత్సాహంగా, కొత్తగా ఉండేలా చూడాలని సూచించారు. పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ ఒక్కోరోజు ఒక్కో రంగం మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా పీపుల్స్‌ ప్లాజా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి హుస్సేన్‌సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా, హెచ్‌.ఎం.డి.ఎ. కమిషనర్‌ చిరంజీవులు, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినకర్‌ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు