నేటి నుంచి వేడుకలు ఆరంభం

24 Sep, 2014 01:10 IST|Sakshi

 ఇంద్రవెల్లి : జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని ప్రధాన్‌గూడలో ఆదివాసీ గిరిజనులు నాలుగేళ్లుగా గిరిజన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతల్లో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఆడుతున్న ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన ఆదివాసీ గిరిజన మహిళలు ఆడుతున్నారు.

 ఏటా దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందు నుంచి ఆ గ్రామం పటేల్ ఇంటి ముందు గుండం ఏర్పాటు చేసి, ఆ గుండంలో బతుకమ్మ మొక్క నాటి, దాని చుట్టూ దీపాలు వెలిగించి గిరిజన సంప్రదాయ రీతిలో డోలు, పేప్రే, కాలికోం వాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు నృత్యాలు చేస్తారు. దసరా పండుగ మరుసటి రోజే సాయంత్రం పండుగ ముగుస్తుంది.

 తంగేడు పువ్వు
 పల్లె ప్రాంతాలు, అడవిలో తంగేడు పువ్వులు సహజసిద్ధంగా లభిస్తాయి. ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మూత్రకోశ వ్యాధులకు తంగేడు పుష్పాన్ని వినియోగిస్తారు. తంగేడు కషాయం శరీరానికి చల్లదానాన్నిస్తుంది. అతిసారం, చర్మ, క్రిమి రోగాలు, నేత్ర జబ్బులకు తంగేడును ఔషధానికి ఉపయోగిస్తారు. తంగేడును నీటిలో వేయడంతో అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. వాతం, ఉష్ణం, ప్రకోపాలను తగ్గించే గుణం ఈ పువ్వులో ఉంది. రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతుంది.

 సీతమ్మ జడ
 కళ్లకు ఇంపుగా కనిపించే సీతమ్మజడ పూలు రంగుల తయారీలో అత్యధికంగా ఉపయోగిస్తారు. సిలోసియా అరెగేటియా అమరాంథస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పుష్పం బతుకమ్మలో అందంగా పేర్చడానికి వినియోగిస్తారు. ఆకర్షకపత్రాలు, నారలు తయారీలోనూ ఈ పుష్పాన్ని వాడుతారు. ఈ పుష్పంలోనూ ఔషధ గుణాలున్నాయి.

 బీరపువ్వు
 పసుపు వర్ణంలో ఉండి కంటికి ఇంపుగా కనిపించే బీరపువ్వు రంగుల తయారీలో ఎంతగానో వినియోగిస్తారు. బీరకాయలను ఎండబెట్టి అందులో నుంచి పీచును వెలికితీసి రంగులలో ఉపయోగిస్తారు. బతుకమ్మలు తయారు చేసి నుదుటన తిలకం దిద్దిన మాదిరి బీరపువ్వును అలంకరిస్తారు.


 గునుగు పువ్వు
 సిలోసియా అర్జెంటీయా శాస్త్రీయ నామం కలిగిన గునుగు పువ్వు బతుకమ్మకు ఎంతో శోభను తెస్తుంది. తెల్లవర్ణంలో ఉన్న ఈ పుష్పం గ్రామాల్లో పశువులకు దాణాకు ఉపయోగపడుతుంది. గునుగుపూలను నీటిలో వేస్తే మలినాలను పీల్చుకొని శుభ్రం చేస్తుంది.  

 బంతి పువ్వు
 ‘క్రిసాంథిమమ్ బయాన్కో’ శాస్త్రీయ నామం కలిగిన బంతి పువ్వు చలువదనానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాలను శుద్ధి చేసి రక్తసరఫరాను మెరుగుపర్చడానికి సరఫరా చేసే ఔషధంలో బంతిపువ్వును వినియోగిస్తారు. గొంతు సంబంధిత వ్యాధులను నయం చేసే లక్షణం ఈ పువ్వులో ఉన్నాయి. సూక్ష్మ క్రీములను నాశనం చేయడంలో బంతి పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.


 గుమ్మడి
 గుమ్మడి పుష్పంలో ఏ,సీ విటమిన్‌లు అధికంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో తలెత్తే కీళ్లనొప్పులను తగ్గించే మందుల తయారీలో ఈ పుష్పాన్ని వాడతారు. ప్రొటెస్ట్‌గ్రంథికి హానికలిగించకుండా గుమ్మడి పువ్వు రక్షణ కవచంగా పని చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని పొలుసులు రాకుండా దోహదపడుతుంది. ఈ పుష్పంలో వేడిని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి.

 మందారం
 ఆకర్షణీయంగా కనిపించే మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆకర్షణ పత్రాలలో ఈ పుష్పాన్ని వాడతారు. ముఖ్యంగా వెంట్రుకలను నల్లబర్చడానికి తయారు చేసే నూనెలో మందార పుష్పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ పుష్పాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీలోనూ మందారాలను వాడుతారు. అతిసారా వ్యాధితో బాధపడే వారికి మందారం ఉపశమనం కలిగిస్తుంది. ఈ పుష్పాలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాసుకున్నట్లయితే తలనొప్పి త్వరితగతిన తగ్గి ఉపశమనం ఇస్తుంది.
 
రుద్రాక్ష పువ్వు
 ఔషధ గుణాలు రుద్రాక్ష పువ్వులో మెండుగా ఉన్నాయి. సౌందర్యసాధనాల తయారీలో రుద్రాక్ష పూలను విస్తారంగా వినియోగిస్తారు. కేక్, జల్లీల తయారీలో రుద్రాక్ష పూలు వాడతారు. ఈ పువ్వులో పుండ్లను నయం చేసే గుణం ఎంతగానో ఉంది. వీటి గింజలు వేసిన చెరువుల్లో స్నానం చేసినట్లయితే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి.  
     
సద్దుల బతుకమ్మ
 బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు.

మరిన్ని వార్తలు