నేడు భువనగిరి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

24 Sep, 2014 01:06 IST|Sakshi
నేడు భువనగిరి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

 తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలు భువనగిరి నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం ఎంగిలిపువ్వుతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, మంత్రి జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు.
 
 భువనగిరి : బతుకమ్మ ఉత్సవాలకు భువనగిరి పట్టణం ముస్తాబైంది. తెలంగాణలో ఇక్కడినుంచే బుధవారం ఎంగిలిపువ్వుతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూనియర్ కళాశాల మైదానం అవరణలో బతుకమ్మ ఆటలు ఆడడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరిగాయి. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ముఖ్య అతిథులుగా హాజరుకాన్నారు. 5వేల మంది హాజరుకానుండడంతో ఆ మేరకు ఏర్పా ట్లు చేశారు.  సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ ఆటలు ఆడనున్నందున విద్యుత్‌దీపాలను అమర్చారు.
 
 ఇదీ..కార్యక్రమం
 ఉదయం 9 గంటలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత భువనగిరికి రానున్నారు. మొదట భువనగిరి ఖిలాను ఎక్కి ఆక్కడ చారిత్రక సంపదపై అధ్యయనం చేస్తారు. మధ్యాహ్నం కిందకు దిగిన తర్వాత బతుకమ్మలను పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిమైన కళలు, కళారూపాల, సాంస్కృతిక కార్యక్రమాలతో హన్మాన్‌వాడ నుంచి జూనియర్ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి బతుకమ్మ ఆటలు ఆడతారు. ఈ ఉత్సవాలకు కలెక్టర్ చిరంజీవులు, భువ నగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
 
 సాయంత్రం 5 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
 పట్టణంలో సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సతీష్‌రెడ్డి చెప్పారు. వినాయక చౌరస్తా నుంచి నల్లగొండ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించనున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు