చీరలొచ్చాయ్‌!

2 Oct, 2018 09:13 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పల్లెల్లో గొప్పతనం, ప్రకృతిలోని అనేక పూలతో మమేకమైన ఈ పండగను పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా నిర్వహిస్తారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జరగనున్న నేపథ్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 558 రేషన్‌ దుకాణాల్లో 2,67,873 లబ్ధిదారులకు గానూ దాదాపు లక్షకు పైగా చీరలు జిల్లాకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన చీరలు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
 
గతంలో ఇలా.. 
గతేడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలను సేకరించింది. ఈ సారి కూడా జిల్లాలో రేషన్‌ దుకాణాల్లో ఉన్న లబ్ధిదారుల్లో 18ఏళ్లు నిండిన వారందరికీ చీరలు పంపిణీ చేయనుంది. అదేవిధంగా ఈసారి కొత్తగా రేషన్‌కార్డులు తీసుకున్న వారు, గత కార్డులలో ఉన్న వారికి 18ఏళ్లు నిండిన వారు కొత్తగా రావడంతో చీరల సంఖ్య మరింత పెరిగింది. పండగ సమయానికి ఎలాంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జిల్లాకు చేరిన లక్ష చీరలు 
బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేసే చీరలను నాగర్‌కర్నూల్‌లోని మార్కెటింగ్‌ శాఖ గోడౌన్‌తోపాటు అచ్చంపేటలో ఉన్న మార్కెటింగ్‌ శాఖ గోడౌన్లలో భద్రపరిచారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షకు పైగా చీరలు చేరాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గతేడాది ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఈసారి చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను నేయించారు. తొమ్మిది రకాల డిజైన్లలో చీరలు తయారు చేశారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలు, వాటి రంగులు, నాణ్య త, డిజైన్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు.

పంపిణీపై రాని స్పష్టమైన ఆదేశాలు 
బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకున్నప్పటికీ వాటి పంపిణీపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడం, బతుకమ్మ పండగ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మాడల్‌ ఎలక్షన్‌ కోడ్‌ను అమల్లోకి తీసుకురావడంతో ప్రభుత్వ పథకాలపై అధికారులు పునరాలోచిస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇంకా రావాల్సి ఉంది 
జిల్లాలో 2లక్షలకు పైగా బతుకమ్మ చీరల ల   బ్ధిదారులు ఉన్నారు. అందులో ఇప్పటివరకు లక్షకు పైగా చీరలు వచ్చాయి. ఇంకా రావాల్సిన లక్ష చీరలు ఈ రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంపిణీ తేదీపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. తేదీ ప్రకటించగానే గ్రామాల వారీగా లబ్ధిదారుల సంఖ్య చూసుకుని పంపిణీ చేస్తాం. – మోహన్‌బాబు, డీఎస్‌ఓ  

మరిన్ని వార్తలు