బతుకమ్మ చీరల పంపిణీ షురూ..

20 Dec, 2018 08:33 IST|Sakshi
సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌

నగరంలో లాంఛనంగా ప్రారంభం

తొలి రోజు ప్రశాంతంగా పది శాతం పంపిణీ

పంపిణీ కేంద్రాలకు చేరిన 60 శాతం స్టాక్‌

14.74 లక్షలపైనే లబ్ధిదారులు  

సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. నగరంలోని పలు  కమ్యూనిటీహాళ్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో  స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులు మీదుగా పేదమహిళలు, యువతులకు  బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల సంక్షేమ, ఆభివృద్ధి పథకాలను ఏకరవు పెట్టారు.  యాకుత్‌పురాలో ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ, మల్కాజిగిరి  నియోజకవర్గం, వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని అంబేద్కర్‌ భవనం, ఆర్‌కేపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ కె.శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.  జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌ కమ్యూనిటీ హల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి  నియోజకవర్గంలోని హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానందనగర్‌  ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు జానకి రామరాజు, దొడ్ల వెంకటేష్‌ గౌడ్, ఎం. లక్ష్మీబాయిలు పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  తొలి రోజు  ఎలాంటి అలజడి లేకుండా పంపిణీ కార్యక్రమంలో  సాఫీగా సాగింది. మొదటి రోజు  సుమారు 12 శాతం వరకు చీరల పంపిణీ పూర్తయినట్లు సమాచారం.

14.74 లక్షల మంది లబ్ధిదారులు...
గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సుమారు 14.74 మంది లబ్థిదారులను అధికారులు గుర్తించారు. ఆహార భద్ర కార్డులను ప్రామాణికంగా తీసుకుంటే 11.14 లక్షల కుటుంబాలు ఉండగా అందులో హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో 5,69,645, శివారు ప్రాంతాలైన రంగారెడ్డి–మేడ్చల్‌ జిల్లాల అర్బన్‌ పరిధిల్లో సుమారు 5,45,110 కుటుంబాలు ఉన్నాయి. ఆహార భద్రత కార్డులో పేరుండీ 18 సంవత్సరాలు నిండిన యువతులు,  వృద్ధ మహిళలు కూడా బతుకమ్మ చీరలకు అర్హులు. దీంతో  హైదరాబాద్‌ జిల్లాలో 6.92 లక్షలు, మేడ్చల్‌అర్బన్‌ పరిధిలో 4.61 లక్షలు  రంగారెడ్డి జిల్లా అర్బన్‌ ప్రాంతలో 3.21 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చీరల పంపిణీకి గాను హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 16 సర్కిళ్లలోని 632 కేంద్రాలు ఏర్పాటు చేశారు.  రంగారెడ్డి జిల్లా అర్బన్‌లో 80 , మేడ్చల్‌లో 189 కేంద్రాలను  ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోదాముల నుంచి పంపిణీ కేంద్రాలకు 60శాతం వరకు స్టాక్‌ చేరింది.

23 వరకు చీరల పంపిణీ...
ఈనెల 23 వరకు  బతుకుమ్మ చీరలు పూర్తి స్థాయిలో పంపిణీ  చేసే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు పౌరసరఫరాల అధికారుల సహకార ం తీసుకుంటున్నారు. అందిరికీ అందుబాటులో ఉండేలా  కమ్యూనిటీ హాళ్లను పంపిణీ కేంద్రాలు నిర్ణయించారు. ప్రతిరోజు బతుకమ్మ చీరల పంపిణీకి లబ్దిదారులకు స్లిప్‌లను అందజేయనున్నారు. ఆయా స్లిప్‌లు అందుకున్నవారు బతుకమ్మ చీరల పంపిణీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. 

మేడ్చల్‌ జిల్లాలో...
సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో బతుకమ్మ చీరలు, క్రిస్‌మస్‌ కానుకల పంపిణీ లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు.  ఘట్కేసర్, మేడ్చల్‌ మండలాల్లో  స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌   మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎంవీరెడ్డి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 6,21,068 బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని నిర్ణయించగా 3,90,614 చీరలు జిల్లాకు చేరాయి. తొలిరోజు 303 రేషన్‌ షాపుల పరిధిలో 83,658 మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.  బుధవారం ఒక్క రోజే 21.42 «శాతం చీరలను  పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ కౌటిల్య తెలిపారు.  

500 మందికి క్రిస్మస్‌ కానుకలు...
క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో బుధవారం 500 మంది క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలు అందజేశారు. శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌లో కీసర మేడ్చల్, శామీర్‌పేట్‌  మండలాలకు చెందిన వారికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి , జిల్లా కలెక్టర్‌ఎంవీరెడ్డి చేతుల మీదుగా కానుకలు అందజేసినట్లు జిల్లా  మైనార్టీ వెల్ఫేర్‌ శాఖ అధికారి విజయకుమారి తెలిపారు. మిగతా 500 కానుకలను గురువారం పంపిణీ చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు