సెప్టెంబర్‌లోగా బతుకమ్మ చీరలు

15 Jul, 2018 01:39 IST|Sakshi

ఉత్పత్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ చీరల ఉత్పత్తిని సెప్టెంబర్‌ చివరిలోగా పూర్తి చేయాలని పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ మేరకు 90 లక్షల చీరలను బతుకమ్మ పండుగకు వారం ముందే సరఫరా చేయాలని సిరిసిల్ల మాస్టర్‌ వీవర్లు, మ్యాక్స్‌ ప్రతినిధులకు సూచించారు. చీరల ఉత్పత్తి వేగాన్ని, లూమ్‌ల సంఖ్య పెంచి డబుల్‌ షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై శనివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపై చీరల నేత కొనసాగుతోందని అధికారులు మంత్రికి నివేదించారు. లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించేందుకు కనీసం 20 వేల లూములపై చీరల ఉత్పత్తి జరపాల్సి ఉందని, ఈ మేరకు త్వరలో ఉత్పత్తి ప్రక్రియను రెట్టింపు చేస్తామని సిరిసిల్ల మ్యాక్స్‌ ప్రతినిధులు తెలిపారు.  

నేతన్నల ఆదాయం పెంచడమే లక్ష్యం
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వడంతోపాటు సిరిసిల్లలోని నేతన్నలకు, పవర్‌లూమ్‌ కార్మికులకు ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. చీరల ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని టెక్స్‌టైల్‌ శాఖ కమిషనరేట్‌ అధికారులను ఆదేశించారు.

వారంలో కనీసం 4 సార్లు సిరిసిల్లలో పర్యటించాలన్నారు. నేతన్నలకు బ్యాంకు, ముద్ర రుణాల మంజూరు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలో త్వరలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ కార్మికులు తయారు చేస్తున్న బతుకమ్మ చీరల నాణ్యతను మంత్రి పరిశీలించారు. వచ్చేవారంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని కలసి పవర్‌లూమ్‌ నవీకరణ పథకం అమలులోని సమస్యలు, సవాళ్లను వివరిస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు