ఈజీ జర్నీ

16 Mar, 2019 12:11 IST|Sakshi

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బ్యాటరీ కార్లు  

ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌కు చేరుకునేందుకు సదుపాయం

సీనియర్‌ సిటిజన్స్, మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యం

24 గంటల పాటు సేవలు

సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. తాజాగా ఫ్లాట్‌ఫామ్‌పై ఒకచోటు నుంచి మరో చోటుకు వేళ్లేందుకు బ్యాటరీ ఆపరేటెడ్‌ కార్ల (బీఓసీ)ను ప్రవేశపెట్టారు. వయోధికులు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలు ప్లాట్‌ఫామ్‌లకు చేరుకునేందుకు వీలుగా ఐదు వాహనాలను 24 గంటలూ అందుబాటులో ఉంచారు.

బ్యాటరీతో నడిచే ఈ వాహనాల్లో ఒకేసారి ఆరుగురు వెళ్లవచ్చు. వాహనం పైన లగేజీ పెట్టుకునేందుకు తగినంత స్థలం కూడా ఉంది. వీటిలో సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు హ్యాండ్‌ బ్రేక్‌ను వినియోగించి తగిన రక్షణ పొందవచ్చు. క్లోజ్డ్‌ యూజర్‌ గ్రూప్‌ (సీయూజీ) ఫోన్లతో అనుసంధానం కలిగిన శిక్షణ పొందిన డ్రైవర్లు వీటిని నడుపుతారు. ఈ వాహనాల్లో కెమరాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఈ వాహనాలను ముందుగా బుక్‌ చేసుకునేందుకు 88273 31111 నంబర్‌లో సంప్రదించవచ్చు. ప్రయాణికుడికి రూ.45 చొప్పున చార్జీ నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు