కారెక్కనున్న బట్టి

7 Jan, 2020 08:29 IST|Sakshi

మూడుసార్లు మున్సిపల్‌ చైర్మన్‌

పలు పార్టీల జిల్లా  అధ్యక్షుడిగానూ..

పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.

సాక్షి, మెదక్‌ : మెదక్‌ జిల్లాలో బట్టి జగపతి అంటే తెలియనివారు ఉండరు. ఆయన రాజకీయ ప్రస్థానం సుమారు నాలుగు దశాబ్దాలుగా వివిధ పార్టీల్లో కొనసాగుతూ వస్తోంది. మూడు సార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా.. మరో రెండు పర్యాయాలుగా కౌన్సిలర్‌గా కొనసాగిన ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మూడుసార్లు, పీఆర్పీ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున మెదక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఆయనకు టీపీసీసీలో చోటు కల్పించింది.

ఆయన రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు బట్టి ఉదయ్‌ యువత నాయకుడిగా కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.  ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో బట్టి జగపతితోపాటు ఆయన కుమారుడు ఉదయ్‌ సైతం టికెట్‌ ఆశించినట్లు సమాచారం. ఉదయ్‌కు టికెట్‌ ఇవ్వడం కుదరదని కాంగ్రెస్‌ నాయకులు చెప్పడంతో  నిరాశకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు టికెట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు .. ఉదయ్‌కు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బట్టి జగపతి తన కుమారుడు ఉదయ్‌తోపాటు కారెక్కి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ముహూర్తం మాత్రం ఇంకా తెలియ రాలేదు.  

మరిన్ని వార్తలు