నేను బతికే ఉన్నా..

23 Jul, 2019 09:11 IST|Sakshi
కలెక్టరేట్‌ ఎదుట తనకు న్యాయం చేయాలని ప్లకార్డు ప్రదర్శిస్తున్న భద్రమ్మ

సాక్షి, మహబూబాబాద్‌: నేను బతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కుమారుడు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి ఆస్తిని కబ్జా చేశాడు. న్యాయం చేయాలంటూ ఓ తల్లి సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యకు వినతిపత్రం అందజేసింది. బాధితురాలు బయ్యారం మండల కేంద్రానికి చెందిన కొండ్రెడ్డి భద్రమ్మ సోమవారం అధికారులు, విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. వివరాలు ఆమె మాటాల్లోనే..

నాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. అందరికి వివాహం చేసి ఆస్తి సమానంగా పంచి ఇచ్చాను. కొన్నేళ్ల క్రితం నా భర్త చేదరయ్య, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు మాత్రమే ఉన్నాడు. నా పేరున ఉన్న 2.06 ఎకరాల భూమిని కౌలు ఇచ్చి దాని ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం గడుపుతున్నాను. ‘రైతుబంధు’డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా ఆభూమి పెద్ద కొడుకు సోమిరెడ్డి పేరున ఉందని తెలిసింది. నేను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి దాంతో నా భూమిని తన పేరున పట్టా చేయించుకున్నాడని భద్రమ్మ వాపోయింది. నేను బతికే ఉన్నా.. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేయకుండానే కొడుకు పేరున పట్టాచేయడం ఎంతవరకు సమంజమని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి నా భూమి నాకు ఇప్పించాలని, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని భద్రమ్మ అధికారులను కోరింది. 

మరిన్ని వార్తలు