50 సీట్లతో బీబీనగర్‌ ఎయిమ్స్‌ 

10 Jan, 2019 00:55 IST|Sakshi

మూడు బ్యాచ్‌ల తర్వాతే 100 ఎంబీబీఎస్‌ సీట్లు 

మూడేళ్లకు అందుబాటులోకి రానున్న ఎయిమ్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీబీనగర్‌ ఎయిమ్స్‌ తొలుత 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ప్రారంభం కానుంది. వాస్తవానికి 100 సీట్లు రావాల్సి ఉన్నా.. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేందుకు మూడేళ్ల సమయం పడుతుండటంతో తక్కువ సీట్లతోనే ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాచ్‌ల వరకు కూడా 50 ఎంబీబీఎస్‌ సీట్లే అందుబాటులో ఉండనున్నాయి. ఎయిమ్స్‌ పూర్తిగా ఉనికిలోకి వచ్చాక 100 ఎంబీబీఎస్‌ సీట్లకు పెంచుతారు. 2019–20 వైద్య విద్య సంవత్సరానికి ఇప్పటికే ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌కు నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు తరగతి గదులు, లైబ్రరీ, హాస్టల్‌ వసతి ప్రస్తుతమున్న నిమ్స్‌ భవనాల్లోనే నిర్వహిస్తారు. నిమ్స్‌ ఆసుపత్రిని ఎయిమ్స్‌కు అప్పగించాక దాని అనుబంధంగానే ఎంబీబీఎస్‌ విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. 

సూపర్‌ స్పెషాలిటీపైనే ప్రధాన దృష్టి.. 
రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లోగా నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 750 పడకలతో ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చే అవకాశముంది. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్‌ భవనాల్లో ఎయిమ్స్‌ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్కడ ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు, 60 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే 15 నుంచి 20 వరకు సూపర్‌ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్‌ సీట్లు వస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల కంటే కూడా సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల పైనే ఎయిమ్స్‌ దృష్టి పెడుతుందంటున్నారు. పైగా మెడికల్‌ రంగంలో పరిశోధనలు ప్రోత్సహిస్తారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వివిధ దేశాల్లో జరిగే సెమినార్లకు విద్యార్థులు, ప్రొఫెసర్లు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. 

స్థానికులకు అవకాశాలు లేనట్టే.. 
బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన ఇతర వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ మేరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తా యి. అన్ని రకాల భర్తీలు కూడా జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు ఉండవు. చిన్నపాటి, నాలుగో తరగతి ఉద్యోగుల వరకు మాత్రం స్థానికులు ఉండే అవకాశముంది. కాగా, నిమ్స్‌ భవనాలను, అక్కడి భూముల ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంద ని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో ప్రస్తుత నిమ్స్‌ భవనంలో ఎయిమ్స్‌ ఓపీ సేవలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి విన్నవించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టత రాలేదు.  

మరిన్ని వార్తలు