బీసీ రుణాలకు బ్రేక్‌

27 Oct, 2018 08:28 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: స్వయం ఉపాధి పథకంలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభం అయినట్లే అయి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్‌ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్‌ బ్రేక్‌ వేసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలను అందించేందుకు ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం వివిధ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు.

అందని ద్రాక్షే.. 
బీసీ కార్పొరేషన్‌ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. మొదటగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికి మాత్రమే రూ.లక్ష రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. తదుపరి 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది.

2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదట ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఆ తర్వాత ఏప్రిల్‌ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులను స్వీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్‌ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు గుర్తించారు. 
750 మందికి పంపిణీ.. 
జిల్లాలో కార్పొరేషన్‌ ద్వారా 15,800 లబ్ధిదారులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేటగిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి–3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేల వంద శాతం సబ్సిడీపై చెక్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి వారిని 50 యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. సబ్సిడీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు రుణాలు అందిస్తారో తెలియక లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎన్నికల కోడ్‌తో  నిలిపి వేశాం..
జిల్లాలో వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 15,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మంది అర్హులుగా గుర్తించి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌ లబ్ధిదారుల జాబితాను పంపించారు. ఇందులో ఆసక్తి గల వారికి రూ.50వేలు వంద శాతం సబ్సిడీపై 750 మందికి అందజేశాం. మిగతా వారికి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిపి వేశాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి, ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు