వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలి

27 Jul, 2019 09:48 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

దోమలగూడ: బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలని, లేదంటే బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు కృష్ణయ్యతో పాటు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారపు గణేషాచారి తదితరులు సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాకు మహర్షి అయిన వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. వాల్మీకి అంటే భారతీయ సంస్కృతికి చిహ్నమని, డబ్బులు సంపాదించడం కోసం ఆయన పేరును పెట్టడం మంచిది కాదన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేదిగా సినిమా ఉండాలే తప్ప సమాజాన్ని భష్టుపట్టించేదిగా ఉండరాదన్నారు. ఈ సినిమా టైటిట్‌ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బోయహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనగ గోపి బోయ, సమితి నాయకులు కృష్ణయ్య నాయుడు, ఎంబి బాలకృష్ణ, పుట్ట అంజయ్య, ఎం రాములు, హన్మంతు, ఎ కోండయ్య, శ్రీగిరి ఆదిశేషు, చొప్పవరపు విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు