రెండు రోజుల్లో సీఎంకు ‘బీసీ’ నివేదిక

6 Dec, 2017 03:20 IST|Sakshi

మూడ్రోజుల పాటు పలు అంశాలపై చర్చ: ఈటల

సాక్షి, హైదరాబాద్‌: వెనకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమానికి చేపట్టాల్సిన పథకాలు, కార్యక్రమాలపై మూడు రోజుల పాటు చర్చించామని, అనేక ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని నివేదిక రూపంలో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక మద్దతు, సర్వీస్‌ సెక్టార్, సంచార జాతుల సంక్షేమంపై చర్చించినట్లు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంగళవారం మూడో రోజు సమావేశం ముగిశాక బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి ఆయన మాట్లాడారు.

బీసీల కోసం ఇప్పటికే ఉన్న 123 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను నడపాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. బీసీల్లోని సంచార జాతులు ఇప్పటి వరకు బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేదని, వీరికోసం ఓ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణాలిచ్చే ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని చెప్పారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదిగేం దుకు చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను మరింత పెంచాలని కోరుతామని పేర్కొన్నారు.

బీసీల్లో మొత్తం 113 కులాలు ఉంటే చట్ట సభల్లోకి ఐదారు కులాల వారే అవకాశాలు పొందారని, మిగిలిన వారు అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేదని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేశామని, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పారు. బీసీల సమస్యలపై మూడు రోజులపాటు విస్తృతంగా సమీక్షించామని, పార్టీలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీనివాస్‌గౌడ్, మండలిలో ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

రైతు సమితులు పెత్తనానికి కాదు..వ్యవసాయ మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితులు వ్యవసాయాధికారులపై పెత్తనాని కి కాదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ భూసార దినోత్సవంలో భాగంగా వ్యవసాయ కమిషనర్‌ డాక్టర్‌ జగన్మోహన్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు.

రైతులు భవిష్యత్తులో ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.50 వేలు లాభం పొందే విధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని అన్నారు. భూసార కార్డుల ఆధారంగా ఎరువులు వాడితే సాగు ఖర్చు గణనీయంగా తగ్గనుందన్నారు. ఏఏ ఎరువులు ఎంత మోతాదులో అవసరమో తెలియక రైతులు రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడుతున్నారని, దీంతో భూసారం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,630 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో మినీ భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పుతున్నామన్నారు.

వీటిని క్లస్టర్‌ కేంద్రంలో రూ.15 లక్షలతో నిర్మించే రైతు వేదికలలో నెలకొల్పుతామన్నారు. గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలకు, తడి భూములయితే 6.25 ఎకరాలకు ఒక నమూనా సేకరించేవారని, ఇకనుంచి ప్రతి రైతు భూమిని భూసార పరీక్ష చేయిస్తామన్నారు. ప్రతీ రైతుకు భూసార కార్డులను పంపిణీ చేస్తామన్నారు.  రైతులు కోరితే వచ్చే జనవరి నుంచి 24 గంటల కరెంటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో రైతులు పంటలు వేసే విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి 2017–18కి సంబంధించిన భూసార కార్డులను రైతులకు అందించారు. భూసార పరీక్షలపై అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. పంటల యాజమాన్యంపై సమాచారం కోసం ప్రత్యేక యాప్‌ ‘‘పంటల యాజమాన్యం’ను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు