బీసీ గురుకులాలదే అగ్రస్థానం

19 Apr, 2019 02:37 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌లో ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి. చిత్రంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తదితరులు

ఇంటర్‌ ఫలితాలు విడుదల

89.8% ఉత్తీర్ణతతో సత్తాచాటిన గురుకుల విద్యార్థులు.. చివరి స్థానంలో ఎయిడెడ్‌ కాలేజీలు

మొత్తంగా ప్రథమ సంవత్సరంలో 59.8%, ద్వితీయ సంవత్సరంలో 65% ఉత్తీర్ణత

ఎంపీసీ టాపర్‌గా శశిధర్‌రెడ్డి (993 మార్కులు), బైపీసీలో చల్లా దీపికారెడ్డి (992 మార్కులు) ఫస్ట్‌

మే 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

పరీక్షలు రాసినా పలువురికి ‘ఆబ్సెంట్‌’,, ‘ఫెయిల్‌’ అంటూ మెమోలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఈసారి బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచారు. ఆ తరువాతి స్థానంలో విద్యాశాఖ గురుకులాలు 88.8 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్‌ కాలేజీలు మాత్రం 50.1 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. 

తగ్గిన ఉత్తీర్ణత శాతం...
రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్‌ విద్యార్థులు 8,70,924 మంది హాజరయ్యారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,653 మంది పరీక్షలకు హాజరవగా 2,70,575 మంది (59.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,18,271 మంది పరీక్షలకు హాజరవగా వారిలో 2,71,949 మంది (65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో బాలికలు 66.2 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ద్వితీయ సంవత్సరం జనరల్‌ రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలికలు 70.8 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.2 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. గతేడాది ద్వితీయ సంవత్సరంలో 67.06 శాతం మంది ఉత్తీర్ణులవగా ఈసారి 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 1,18,455 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 1,52,120 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,18,591 మంది బాలురు ఉత్తీర్ణులుకాగా 1,53,358 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 72,365 మంది పరీక్షలకు హాజరుకాగా 18,365 మంది (25.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

మేడ్చల్‌ టాప్‌.. మెదక్‌ లాస్ట్‌
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్‌ జిల్లా 76 శాతం ఉత్తీర్ణత సాధించగా 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలించింది. మెదక్‌ జిల్లా మాత్రం 29 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానానికి పరిమితమైంది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో మేడ్చల్‌ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా 75 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 35 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌లో 87 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్‌ ప్రథమ స్థానంలో నిలవగా, కొమురం భీం జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 51 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.

వచ్చే నెల 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఎన్నికలనుబట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులతోపాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో పేపరుకు రూ. 150 చొప్పున చెల్లించి ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవచ్చని పేర్కొన్నారు. రెండింటిలో ఎందులో ఎక్కువ మార్కులుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కమ్‌ స్కాన్డ్‌ జవాబు పత్రాల కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు రీ కౌంటింగ్‌ కోసం ప్రతి పేపరుకు రూ. 100 చొప్పున చెల్లించాలని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రీ వెరిఫికేషన్‌ కమ్‌ స్కాన్డ్‌ జవాబు పత్రాల కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 25లోగా ఆన్‌లైన్లో ( ఠీఠీఠీ. bజ్ఛీ. ్ట్ఛl్చnజ్చn్చ. జౌఠి. జీn) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నవుతా..
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను అధ్యాపకుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంపీసీలో 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలనేది నా లక్ష్యం. బిట్స్‌ పిలానీలో సీఎస్‌సీలో సీటు సంపాదిస్తా.
-ఎన్‌. శశిధర్‌రెడ్డి, ఎంపీసీ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ (993 మార్కులు), అల్పోర్స్‌ కళాశాల(ద్వితీయ), కరీంనగర్‌

ఫలితాల తగ్గుదలకు ప్రధాన కారణాలు..
ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గతేడాది కంటే ఈసారి 2 శాతం తగ్గిపోయాయి. గతేడాది ప్రథమ సంవత్సరంలో 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 60.5 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అలాగే గతేడాది ద్వితీయ సంవత్సరం 67.06 శాతం మంది ఉత్తీర్ణులుకాగా ఈసారి 65 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో గత రెండేళ్లతో పోల్చుకున్నా ఈసారి ఫలితాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

  • 2018–19 విద్యా సంవత్సరం జూన్‌లో పూర్తి కావాల్సిన మొదటి దశ ప్రవేశాలు ఆగస్టు చివరి వరకు కొనసాగడం.
  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూన్‌లో తరగతులు ప్రారంభమైనా 1,200 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీని ఆగస్టులో నియమించడం.
  • జూన్, జూలైలలో అధ్యాపకుల బదిలీలతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకం ఏర్పడటం.
  • గ్రామ పంచాయతీ ఎన్నికలు, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల పాఠ్యాంశాల బోధన సకాలంలో పూర్తికాకపోవడం.

ఎంపీసీలో 993.. బైపీసీలో 992.. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో టాప్‌ మార్కులివే
తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారి అత్యధిక మార్కులు 993. ఈ మార్కులను ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఒకే ఒక్క విద్యార్థి నల్ల శశిధర్‌రెడ్డి సాధించగా ఆ తరువాత 992 మార్కులను బి. ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎస్‌. దినేశ్‌రెడ్డి సాధించారు. బైపీసీలో 992 మార్కులతో చల్లా దీపికారెడ్డి టాపర్‌గా నిలవగా ఆ తరువాత 991 మార్కులతో బింగి సాయితేజ రెండో ర్యాంకు సాధించాడు. ఎంఈసీలో 987 మార్కులతో వి. వంశీ తొలి ర్యాంకు సాధించగా ఆ తరువాత 985 మార్కులతో డి. వైష్ణవి రెండో ర్యాంకు సాధించింది. హెచ్‌ఈసీలో అత్యధిక మార్కులు 964 పీఎస్‌ఎన్‌ సౌగంధికకు లభించాయి. సీఈసీలో అత్యధిక మార్కులు 979 దివాన్‌ శివానీకి లభించాయి.

చల్లా దీపికారెడ్డి, నల్ల శశిధర్‌రెడ్డి

ప్రథమ సంవత్సరంలో..
ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నలుగురికి అత్యధికంగా 467 మార్కులు లభించగా 33 మందికి 466 మార్కులు వచ్చాయి. బైపీసీలో ముగ్గురికి అత్యధికంగా 437 మార్కులు లభించాయి. ఎంఈసీలో ముగ్గురికి అత్యధికంగా 494 మార్కులు రాగా హెచ్‌ఈసీలో ఒక్కరికే అత్యధికంగా 486 మార్కులు లభించాయి. సీఈసీలో ఇద్దరికి అత్యధికంగా 492 మార్కులు లభించాయి.

పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్‌?
ఇంటర్‌ పరీక్షల ప్రాసెసింగ్‌లో లోపాలు తలెత్తినట్లు తెలిసింది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో వందలాది మంది విద్యార్థులకు తప్పుల తడకగా మార్కులు వచ్చాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైనా పలువురు విద్యార్థులను ఆబ్సెంట్‌ అయినట్లు చూపించి ఫెయిల్‌ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మేడ్చల్‌ జిల్లాలోని ఓ కార్పొరేట్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో ఫెయిల్‌ చేసినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఒక్క సబ్జెక్ట్‌ మినహా అన్ని సబ్జెక్టుల్లో 831 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఇంగ్లీష్‌ పేపర్‌–2 పరీక్షకు హాజరుకానట్లుగా మెమోల్లో ఆబ్సెంట్‌ వచ్చింది.

అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యారని సదరు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. 810 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి మాథ్స్‌ పేపర్‌–2బీలో 17 మార్కులే వచ్చినట్లు చూపించారని, బాగా చదివే ఆ విద్యార్థికి అంత తక్కువ మార్కులు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 841 మార్కులు వచ్చిన మరో విద్యార్థిని సంస్కృతం పేపర్‌–2లో ఆబ్సెంట్‌గా చూపించి ఫెయిల్‌  చేశారన్నారు. మరోవైపు వందల మంది విద్యార్థులకు ఫలితాలే ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అనేక మంది విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌తో ఫలితాలు చూసుకోగా ఇన్‌వ్యాలిడ్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌ అని వస్తోందని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్‌వెర్‌ సంస్థకు ఫలితాల ప్రాసెస్‌ పనులను అప్పగించడం వల్లే ఇలాంటి తప్పిదాలు దొర్లాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమస్యలపై మొదటి నుంచీ మొత్తుకుంటున్నా బోర్డు అధికారులు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని అధ్యాపకులు మండిపడుతున్నారు మేడ్చల్‌లోని సదరు కార్పొరేటు కాలేజీ యాజమాన్యానికి బోర్డు ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు విద్యార్థులను కూడా బయటకు రాకుండా కాలేజీ క్యాంపస్‌ గదుల్లోనే పెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..

సరిహద్దుల్లో చేతివాటం!

పార్టీని మీరే కాపాడాలి : సోనియా

2,166 మందిపై అనర్హత వేటు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..