టార్గెట్‌ ఇవ్వాల్సిందే..!

25 May, 2018 10:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీసీ కార్పొరేషన్‌ పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై అయోమయం

వేలల్లో వచ్చిన దరఖాస్తుల వడపోత సులువు కాదంటున్న ఎంపీడీఓలు

మండలం వారీగా టార్గెట్‌ లేకుండా గ్రామసభల నిర్వహణ కష్టం 

నల్లగొండ : బీసీ కార్పొరేషన్‌ పథకాలపై అనిశ్చితి నెలకొంది. స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడంపై అధికారులు అయోమయంలో పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం లేకుండా పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయడం అంత సులువు కాదని ఎంపీడీఓలు తేల్చి చెబుతున్నారు. పథకాల మార్గదర్శకాల్లో మార్పు చేయాలని, లేదంటే క్షేత్రస్థాయిలో రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే ముందుగా అర్హులైన వారితో జాబితా తయారు చేయాలని కార్పొరేషన్‌ విధివిధానాలు రూపొందించింది.

పేద, నిరుపేద కుటుంబాలు, వితంతువులు, వికలాంగులు, సంచార జాతుల వారికి ప్రాధాన్యత కల్పించా లని, మొత్తం స్కీంల్లో 33 శాతం మహిళలకు, 3 శాతం వికలాంగులకు ఇవ్వాలని చెప్పారు. ఈ రకంగా మండలం, పట్టణాల్లో అర్హులైన వారితో జాబితా తయారు చేయాలంటే రాజకీయంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేషన్‌ పథకాలపై దృష్టి సారించడం కూడా అంత çసులువుకాదనే విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుబంధు కార్యక్రమం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో  భాగంగా ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు క్షణం తీరికలేకుండా గ్రామాల్లో తిరుగుతున్నారు.   ఇప్పటికిప్పుడు గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తిం చడం కష్టమైన పనేని ఎంపీడీఓలు అంటున్నారు. 

పనిఒత్తిడితో సతమతం....
రైతుబంధు కార్యక్రమం ఈ నెల 17 వరకు కొనసాగింది. మరో వైపు పంచాయతీ ఓటర్ల జాబితాపై ఎంపీడీఓలు, అధికారులు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ఓటర్ల జాబితా పూర్తికాక ముందే పోలింగ్‌ కేంద్రాల పని మొదలైంది. కొత్తగా పంచాయతీలు ఏర్పాటైన నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇది కొనసాగుతుండగానే రైతుబంధు కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు వచ్చే నెల 25 వరకు గడువు పొడిగించారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పనిభారం పెరగడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు రైతుబంధు పథకం ముడిపడి ఉండటంతో మరేతర పని పెట్టుకోకుండా చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ వందశాతం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యాకే కార్పొరేషన్‌ పథకాలపై దృష్టి సారిస్తామని ఎంపీడీఓలు చెబుతున్నారు. 

లక్ష్యం నిర్దేశిస్తేనే గ్రామసభలు...
లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే మండలం, పట్టణం వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని, అలా కాకుండా గ్రామసభలు నిర్వహించడం వీలుకాదని అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34,284 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటిని వడపోసి, అర్హులైన వారితో జాబితా తయారు చేయడం తలకుమించిన భారమని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని, మండలం, పట్టణాల్లో ఒక్కో స్కీంకు ఎంత మందిని ఎంపిక చేయాలనే దానిపైన నిర్దేశించిన లక్ష్యాన్ని ముందుకు ఖరారు చేస్తే లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి లిఖితపూర్వక లేఖ రాశారు.

ముగిసిపోతున్న గడువు....
కార్పొరేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం లక్ష రూపాయల పథకాలకు లబ్ధిదారులను ఈ నెల 15 తేదీలోగా ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా రెండు లక్షల పథకాలకు 25వ తేదీ, రెండు లక్షలు దాటిన పథకాల లబ్ధిదారులను జూన్‌ 5 తేదీలోగా ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా అధికారులకు పంపాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలి. కానీ ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఈ ప్రక్రియ మొదలు కాలేదు.   

మరిన్ని వార్తలు