బాత్రూంలో బడి బియ్యం

23 Sep, 2019 09:06 IST|Sakshi
బాత్రూంలో నిల్వ ఉన్న బియ్యం ,తనిఖీల అనంతరం బియ్యం బస్తాలను స్టోర్‌ రూమ్‌కు తరలిస్తున్న సిబ్బంది

బీసీ సంక్షేమ హాస్టల్‌లో అక్రమ బాగోతం

తనిఖీలకు ముందే బాత్రూంలోకిబియ్యం తరలింపు

చంచల్‌గూడ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే వసతి గృహాల్లో విద్యార్థులకు వండిపెట్టాల్సిన సన్న బియ్యం బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నాంపల్లి, గోషామహల్‌ వసతి గృహాలు యాకుత్‌ పురా నియోజకవర్గం కుర్మగూడలోని ఓ భవనంలో కొనసాగుతున్నాయి. పౌరసరఫరా శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాల్లో సరుకులు, బియ్యం నిల్వలకు సంబంధించి సోదా లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న మధ్యాహ్నం  కుర్మగూడ లోని వసతి గృహాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్‌ రూమ్, వంటశాలను కూడా పరిశీలించారు.

బాత్రూంలో 16 సంచుల బియ్యం.
తనిఖీలు నిర్వహించిన అధికారులు అంతా సక్రమంగానే ఉందని నిర్థారణకు వచ్చారు. అయితే అధికారులు వెనుదిరిగిన అనంతరం భవనంలోని ఓ బాత్‌రూమ్‌లో 16 సంచుల బియ్యం దర్శనం ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాత్‌రూమ్‌లో బియ్యం బస్తాలను గుర్తించిన విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుంది. స్టోర్‌ రూమ్‌లో ఉండాల్సి బియ్యాన్ని బాత్‌రూమ్‌లోకి ఎందుకు తరలించారనే వాదన వినిపిస్తోంది. దీంతో హాస్టల్‌ వార్డన్‌ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉత్తుత్తి తనిఖీలేనా...?
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు వసతి గృహంలో చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిస్తోంది. దాదాపు 8 నుంచి 10 క్వింటళ్ల బియ్యం బాత్‌రూంలో నిల్వ చేసినా తనిఖీలకు వచ్చిన  అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. అసలు  వసతి గృహంలో తనిఖీలు జరుగుతున్నట్లు హాస్టల్‌ వార్డెన్‌కు ముందుగానే సమాచారం అందినట్లు తెలుస్తెంది. ఈ అంశంపై సివిల్‌ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.    

తనిఖీలు జరిగాయి..
తనిఖీల విషయమై జిల్లా బీసీ సంక్షేమాధికారి విమలాదేవిని ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్‌లో సంప్రదించగా కుర్మగూడలోని (నాంపల్లి, గోషామహాల్‌) వసతి గృహాల్లో ఈ నెల 13న సివిల్‌ సప్లయ్‌  తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే దీనిపై కమిషనర్‌కు నివేదిక అందజేస్తారని ఆమె వివరించారు.–విమలాదేవి,జిల్లా బీసీ సంక్షేమ అధికారి 

మరిన్ని వార్తలు