బీసీ సంక్షేమ సంఘం ‘బీసీ డిక్లరేషన్‌’

14 Dec, 2017 03:59 IST|Sakshi

68 అంశాలతో రూపకల్పన 

రెండ్రోజుల్లో కేసీఆర్‌కు సమర్పణ 

నివేదిక సారాన్ని వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య 

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధికి బీసీ ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ అంశాల్లో జనాభా ప్రాతిపాదికన ప్రాధాన్యత కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. బీసీ ప్రణాళిక కోసం ప్రభు త్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలతో బీసీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 రోజులుగా వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ ప్రణాళిక తయారీలో కమిటీ బీజీ అయింది. ఈ నేపథ్యంలో బీసీ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం సరికొత్తగా నివేదిక రూపొందించింది. బీసీల అభివృద్ధికి రాజకీయ పాలసీ అవసరమని బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. 22 అంశాలతో రాజకీయ పాలసీని తయారు చేసింది. బీసీ సంక్షేమ సంఘంతోపాటు అనుబంధ సంఘాల ప్రతినిధు లు, మేధావుల ఆలోచనలతో 68 అంశాలతో కూడి న నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఈ నివేదికను రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన నివేదికలోని పలు అంశాలు ఇవీ... 

రాజకీయ విధానం: రూ.20 వేల కోట్లతో బీసీ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అన్ని పార్టీలు 50% టిక్కెట్లు ఇవ్వాలి. విద్య, ఉద్యోగాల్లో 52% రిజర్వేషన్ల అమలుతోపాటు క్రీమీలేయర్‌ తొలగించాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 నుంచి 52 శాతానికి పెంచాలి. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50% కేటాయించాలి. ప్రభుత్వ శాఖల్లోని లూప్‌లైన్‌ పోస్టులు కాకుండా ఉన్నత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, గురుకులాల కార్యదర్శి పోస్టులు బీసీలకే కేటాయించాలి. ఇందులోనే పారిశ్రామిక పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలి. కాంట్రాక్టుల్లో డిపాజిట్‌ లేకుండా 50 శాతం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టు తీసుకురావాలి. తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల్లో కలపాలి. 

ఆర్థిక విధానం: బీసీ ఆర్థిక విధానాన్ని 23 అంశాలతో రూపొందించారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.5 వేల కోట్లు కేటాయించాలి. కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా వెయ్యి కోట్లు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఆరె కటిక, మున్నూరుకాపు, పెరిక ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. అన్ని ఫెడరేషన్లకు పాలక మండళ్లను సకాలంలో నియమించాలి. ఫెడరేషన్ల ద్వారా గ్రూపు రుణాల స్థానంలో వ్యక్తిగత రుణాలే ఇవ్వాలి. 

ఉద్యోగ, ఉపాధి పాలసీ: ఇందులో ఆరు అంశాలను పొందుపర్చారు. పూర్తి వసతులతో జిల్లాకో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి. సివిల్స్‌తోపాటు గ్రూప్స్‌ తదితర పోటీ పరీక్షలకు 10 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలి. కాలేజీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా స్పోకెన్‌ ఇంగ్లిష్, కెరీర్‌ గైడెన్స్, పర్సనాలిటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించాలి.  

విద్యా పాలసీ: ఇందులో 17 అంశాలను పొందుపర్చారు. బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు విడుదల చేయాలి. ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీల్లో చదివే బీసీ విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలి. అడ్మిషన్ల సమస్య లేకుండా అదనంగా 80 కాలేజీ హాస్టళ్లను తెరవాలి. ప్రతి నియోజకవర్గంలో బాల, బాలికల గురుకులాలు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది 119 ఏర్పాటు చేసినప్పటికీ జనాభా ప్రాతిపదికన అవి చాలకపోవడంతో వచ్చే ఏడాది మరో 119 గురుకులాలు తెరవాలి. పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. పోటీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థుల వయస్సును సమం చేస్తూ అవకాశం కల్పించాలి.   

మరిన్ని వార్తలు