పూర్తి ‘ఫీజు’ ఇవ్వాల్సిందే!

31 Dec, 2017 01:49 IST|Sakshi

బీసీ విద్యార్థి మహాగర్జనలో తీర్మానం

క్రీమీలేయర్‌ నిబంధన ఎత్తివేయాలి ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ఇవ్వాలి

రూ. 20 వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ ఏర్పాటుచేసి చట్టబద్ధత కల్పించాలి

చట్టసభల్లోనూ 50% సీట్లివ్వాలి దీనిపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

మహాగర్జనకు వేలాదిగా వచ్చిన విద్యార్థులు

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఈటల

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని బీసీ విద్యార్థి మహాగర్జన తీర్మానించింది. బీసీ క్రీమీలేయర్‌ నిబంధనను ఎత్తివేయాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని.. చట్టసభల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరింది. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రైవేటు రంగాల్లో సమాన వాటా హక్కుగా కల్పించాలని డిమాండ్‌ చేసింది. శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో బీసీ విద్యార్థి మహా గర్జన సభ జరిగింది. ఇందులో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, జస్టిస్‌ ఈశ్వరయ్య, బీసీ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈటల, జోగు రామన్న తదితరులు మాట్లాడారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ తీర్మానాలు చేశారు.
 
బీసీల సంక్షేమం కోసం కృషి: ఈటల రాజేందర్‌
తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్ల పసిపాప అని.. అయినా సంక్షేమ పథకాల అమల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. గురుకులాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని, బీసీల కోసం ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాలు ప్రారంభించామని తెలిపారు. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయం, ఆడపిల్లల వివాహం కోసం రూ.75 వేల ఆర్థిక సాయం అందచేస్తున్నామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించాలని, సమస్యలుంటే ఐక్యంగా పోరాడాలని సూచించారు. బీసీ ప్రజాప్రతినిధులు వారి వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. ప్రస్తుతం చదువుకున్న వారికి ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన తీర్మానాలపై ప్రభుత్వం చర్చించి జీవో ఇస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఈటల గుర్తు చేశారు. బీసీలకు 50శాతం రిజర్వేషన్ల కోసం ప్రధానిని కలుస్తామని చెప్పారు.
 
ఆర్థికంగా బలోపేతం కావాలి: జోగు రామన్న
బీసీలందరూ దారిద్య్రరేఖకు దగ్గర ఉన్నవారేనని, వారు ఆర్థికంగా బలోపేతమైతేనే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. విద్యార్థులు గతంలో మెస్‌చార్జీల కోసం ధర్నాలు చేసేవారని, ఇప్పుడా పరిస్థితులు లేవని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అందరి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారన్నారు. బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీసీలకు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలతోపాటు ఇంటిగ్రేటెడ్‌ విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ బీసీలకు స్థానిక సంస్థల్లో 33శాతం ఇస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం 50 శాతం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. జనాభాలో 54 శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉండి.. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు.
 
పార్టీలకు అతీతంగా పోరాడాలి: దత్తాత్రేయ
పార్టీలకు అతీతంగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాలు విద్య, ఉద్యోగాలతో ముడిపడి ఉన్నాయని, బీసీల కోసం సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాయకులు పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదికి రావడం అభినందనీయమన్నారు.
 
బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి: లక్ష్మణ్‌
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు 19 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం శోచనీయమని కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని... బ్రహ్మాస్త్రమైన ఓటు హక్కును ఉపయోగించుకుని బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
 
సంఘటితంగా లేకపోవడమే సమస్య: జస్టిస్‌ ఈశ్వరయ్య
బీసీలంతా సంఘటితంగా లేకపోవటం వల్లే వెనుకబడి ఉన్నారని జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థుల పాత్ర కీలకమని, రాజకీయ పెద్దలు వారిని చైతన్యవంతం చేసి సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
 
సమస్యలపై ఉద్యమించండి: నటుడు సుమన్‌
బీసీలు తమ సమస్యలపై ఉద్యమించాలని, అవసరమైతే సినీ రంగాన్ని వదులుకుని తాను బీసీలకు మద్దతు పలుకుతానని సినీ నటుడు సుమన్‌ చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు పార్లమెంటులోని ప్రతి బీసీ ఎంపీ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, కలిసికట్టుగా కోరితే బీసీలకు కూడా పదవి వస్తుందని చెప్పారు.
 
అధికారం సాధించాలి..
తపన, పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని.. తెలంగాణలో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు శ్రమించాల్సి ఉంటుందని ఎల్‌.రమణ పేర్కొన్నారు. బీసీ విద్యార్థులు పల్లెబాట పట్టి 2019 ఎన్నికల్లో 60 సీట్లు సాధించేందుకు కృషి చేయాలన్నారు. 60 కోట్ల జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో రూ.800 కోట్లు మాత్రమే కేటాయించటం దారుణమని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేర్కొన్నారు. రాజ్యాధికారమే సమస్య అని, విద్యార్థులు అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరముందని చెప్పారు. సమాజాన్ని చైతన్యపరిచి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనని పొన్నాల లక్ష్మయ్య సూచించారు. డెబ్బై ఏళ్ల పాలనలో తెలంగాణలో 23 గురుకులాలు ఉంటే.. రాష్ట్రం వచ్చాక ఒకే ఏడాదిలో 119 గురుకులాలు ఏర్పాటయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

బీసీ విద్యార్థి గర్జన తీర్మానాలివే..
– ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల తరహాలో బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వాలి.
– ప్రైవేట్‌ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి.
– కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టేందుకు నియంత్రణ చట్టం తీసుకురావాలి.
– విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలి.
– ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజులను ప్రభుత్వమే భరించాలి.
– ప్రతీ మండలానికి ఒక గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి.
– ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు పొందే రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి.
– కేంద్రంలో ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 1.5 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
– బీసీ క్రీమీలేయర్‌ నిబంధనను ఎత్తివేయాలి.
– చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి.
– రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలి.
– బీసీ భవన్‌కు హైదరాబాద్‌లో పదెకరాలు, జిల్లాల్లో ఐదెకరాల స్థలాలు కేటాయించాలి.
– బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రైవేటు రంగాల్లో సమాన వాటా కల్పించాలి

మరిన్ని వార్తలు