అప్రమత్తంగా ఉండండి

18 Aug, 2018 02:49 IST|Sakshi

     భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఆరా  

     అధికారులతో ఈటల సమీక్ష 

     కాళేశ్వరంలో నిలిచిపోయిన పనులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలతోపాటు కరీంనగర్‌ పాత జిల్లా పరిధిలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఈటల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, సహచర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.  

ఆగిన కాళేశ్వరం పనులు  
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల వద్ద పనులు నిలిచిపోయాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుపై ఉన్న యంత్రాలు, ఇంజనీర్లు, కూలీలను వెనక్కి రప్పించారు. కాగా, కాళేశ్వరం, మంథని, మెట్‌పల్లి, సారంగపూర్, ఏటూరు నాగా రం ప్రాంతాల్లో 8 నుంచి 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎల్లంపల్లి వద్ద గేట్లు ఎత్తివేయడంతో నీటిని దిగువకు వదిలారు. ఈ క్రమంలో భారీగా ప్రవా హం వస్తుండటంతో ముం దస్తు చర్యలు చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి, రెండో బ్యారేజి అన్నారం, మేడిగడ్డ వద్ద భారీ ప్రవాహం ఉన్నందున ఇంజనీరింగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కూలీలు, యం త్రాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.  మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలు, గ్రావెటీ కెనాల్‌ వద్ద పనులు నిలిచిపోయాయి.

మేడిగడ్డ వద్ద వరద ఉధృతితో బ్యారేజి ప్రాంతంలో నిర్మించిన కాఫర్‌ డ్యాంకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్‌ఎండీ కాలనీ అతిధిగృహంలో ఎస్సార్‌ఎస్పీ అధికారులతో మంత్రి ఈటల రివ్యూ సమావేశం నిర్వహించారు. మానకొండూర్, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో తప్ప కోరుట్ల, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ఆయా నియోజకవర్గాలో చెరువులు, కుం టలు పూర్తిగా నిండాయని తెలిపారు. భూగర్భ జలాలు కూడా పెరిగాయని చెప్పారు.  కాగా భారీ వర్షాల కారణంగా మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, వినోద్‌ కుమార్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు