వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

8 Jun, 2018 02:34 IST|Sakshi

అధికారులను ఆదేశించిన సీఎస్‌  

రుతుపవనాల ప్రభావం,సన్నద్ధతపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 99 శాతం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు.

పోలీసు, మిలిటరీ, ఎయిర్‌ ఫోర్స్, రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ పంచాయతీరాజ్, మున్సిపల్, పశుసంవర్థక, వైద్య, విద్యుత్తు, రైల్వే, ఫైర్‌ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ శాఖలు నిరంతరం పంచుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని విభాగాలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.  

ప్రత్యేక యాప్‌...: విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ప్రజలకు వాతావరణ వివరాలు తెలిసేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎస్‌ వెల్లడించారు. వాతావరణ శాఖ ద్వారా వర్షపాతం అలర్ట్స్‌ను అన్ని శాఖలకు రోజూ పంపిస్తున్నామని, 31 జిల్లాల్లో వర్షపాతాన్ని నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వెబ్‌సైట్, వాట్సాప్‌ గ్రూపు ద్వారా వాతావరణ శాఖ ప్రతిరోజు సమాచారాన్ని చేరవేస్తోందని, ప్రజలకు తెలిసేలా మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు.

హైదరాబాద్‌ నగరంలో లోతట్టు ప్రాంతాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించాలని సూచించారు. బస్తీ దవాఖానాల్లో మందులను అందుబాటులో ఉంచాలని, యాంటీ లార్వా ఆపరేషన్లను చేపట్టాలని, నాలాల పూడికలు తీయాలని, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసు కం ట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించాలని సూచించారు. మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినందున, రైతులకు సరిపడే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం, వ్యాక్సిన్లు, పంచా యతీ రాజ్‌ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతులు, ఇరిగేషన్‌ ద్వారా చెరువులు, కుంటలు, ట్యాంకులకు పటిష్ట చర్యలు, సివిల్‌ సప్లై నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్‌ శాఖ ద్వారా స్వచ్ఛమైన మంచి నీరు సరఫరా చేయా లని ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పంచా యతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌.వి.చంద్రవదన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్‌ భగవత్‌  పాల్గొన్నారు.    

నేడు రాష్ట్రానికి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు శుక్రవారం రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవన గాలులు పశ్చిమ దిశ నుంచి రావాల్సి ఉండగా, వాయవ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ముం దుగా అనుకున్నట్లుగా గురువారం ప్రవేశించలేదని, గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తాయని అన్నారు. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా 2 రోజులుగా రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయని వివరించారు.


వర్షాలొస్తున్నాయి.. జాగ్రత్త : మహమూద్‌ అలీ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రెవెన్యూ శాఖ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. గురువారం సచివాలయంలో వర్షాకాల పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో భాగంగా రాష్ట్రంలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షాల వల్ల నష్టం కలగకుండా తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు