దొరలపాలన అంతమవ్వాలి.. ప్రజాస్వామ్యం బతకాలి..

27 Nov, 2018 09:33 IST|Sakshi
అమరచింతలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

సాక్షి, అమరచింత : తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనలో విసిగివేసారిన జనం దొరలపాలనకు చరమగీతం పలికి బహుజనులకే రాజ్యాధికారం అందించడానికి ముందుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు.

సోమవారం అమరచింతలో బీఎల్‌ఎఫ్‌ మక్తల్‌ నియోజకవర్గ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ అమరచింతలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీళ్లు,నిధులు, నియామకాలు అంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీళ్లను మింగాడని, నిధులను దోచుకున్నాడని నియామకాలను వదిలేశారని ఆరోపించారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని, అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూంలను నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్ర

జాసంక్షేమాన్ని విస్మరించిన ఆయారాజకీయ పార్టీలు మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. మక్తల్‌ నియోజకవర్గాన్ని పరిపాలించిన చిట్టెంరాంమోహన్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి వారిసొంత ఆస్తులను పెంచుకున్నారే తప్పా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం శోచనీయం అన్నారు.

కొత్తమండలాలతో పాటు కొన్నిచోట్ల పాతమండలాల్లో కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కూడా ఏర్పాటు చేయలేని పాలకులను సాగనంపాలన్నారు. నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకట్‌రాంరెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్‌ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జీఎస్‌.గోపి, సీపీఎం సీనియర్‌ నాయకులు మహిమూద్, శ్యాంసుందర్, బుచ్చన్న, రమేష్, తిమ్మోతి, వెంకటేష్‌ పలువురు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు