మొలంగూర్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌

25 Sep, 2019 08:45 IST|Sakshi

సాక్షి, మానకొండూర్‌ : శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కి హల్‌చల్‌ చేసింది. చెట్టు ఎక్కిన ఎలుగుబంటిని మంగళవారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి కేశవపట్నం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది, అటవీశాఖ రేంజర్‌ ముంతాజ్‌అలీ, సెక్షన్‌ ఆఫీసర్లు సరిత, సురేందర్, బీట్‌ ఆఫీసర్లు లావణ్య, అనంతరాములు, రెస్క్యూ టీం పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ మొలంగూర్‌ చేరుకున్నారు. ఎలుగుబంటిని చెట్టుపై నుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. పశువైద్యాధికారి దానికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి చెట్టు కింద వల ఏర్పాటు చేసి, ఆరు గంటలు శ్రమించి, వలలో బంధించారు. అయినా ఆ ఎలుగుబంటి వల నుంచి తప్పించుకొని, సమీపంలోని గుట్టవైపు పరుగు తీసింది. అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకొని మరోసారి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. అనంతరం అటవీశాఖ వాహనంలో తాడ్వాయి ఫారెస్ట్‌లో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు