అమ్మో జ్వరం

3 Nov, 2018 09:50 IST|Sakshi
గాంధీ ఆస్పత్రిలో ఇటీవల నేలపైనే చికిత్స అందిస్తున్న సిబ్బంది

ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా సరే..

గాంధీలో ఉంది 1,092 పడకలు, ఇన్‌పేషంట్లు 1,929 మంది

అనుమానిత స్వైన్‌ఫ్లూ, డెంగీ బాధితులను చేర్చుకోని వైనం

ఉస్మానియాలోనూ ఇదే దుస్థితి.. పట్టించుకోని యంత్రాంగం

సాక్షి,సిటీబ్యూరో: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి ఇతర సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ జ్వర పీడితులే కాదు.. దగ్గు, జలుబు, తలనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వారిని చేర్చుకుని చికిత్స అందించే విషయంలో వైద్యులు సైతం చేతులెత్తేస్తున్న దుస్థితి. వస్తున్న రోగులకు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడంతో ప్రాణాంతకమైన స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాలతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న నిరుపేద రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే కాదు.. హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఇలాగే ఉంది. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్‌ ఆస్పత్రి ఔట్‌పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున మూడు వేల మందిరోగులు వస్తున్నారు.

1,062 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 1500 మందికి పైనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500 పైగా పాజిటివ్‌ స్వైన్‌ కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం గాంధీ జనరల్‌ ఆస్పత్రిని ప్రత్యేక నోడల్‌ కేంద్రంగా ఎంపిక చేసింది. 20 పడకలు, 10 వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ అనుమానితులు ఇతర ఆస్పత్రుల నుంచి రెఫరల్‌పై వచ్చిన రోగులకు క్యాజువాలిటీలోనే చుక్కెదురవుతోంది. రోగులకు తగ్గ పడ కలు లేకపోవడంతో చాలా మంది ఫ్లోర్‌ బెడ్‌పైనే ఉంచి చికిత్సలు అందించాల్సి వస్తోంది. బుధవారం 1,929 మంది ఇన్‌పేషంట్లు ఉన్నారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ పాజిటివ్‌ కేసులనే చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అనుమాని తులను ఓపీలోనే నమూనాలు సేకరించి పంపుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయి వైద్యుల చేతికి నివేదికలు అందే సమయానికి వ్యాధి తీవ్రత మరింత పెరిగి రోగులు మృత్యువాతపడుతు న్నా.. వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదు.

ఉస్మానియాకు తరలింపు..
ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు తగ్గ పడకలు ఏర్పాటు చేసే అవకాశమున్నా స్థలం సమస్యగా మారింది. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడం, ఇప్పటికే పలుమార్లు పైకప్పు కూలడం, మూడు, రెండు అంతస్తుల్లోని వార్డులను పూర్తిగా ఖాళీ చేయడం తెలిసిందే. సాధారణ రోగులతోనే సతమతమవుతున్న ఆస్పత్రి యంత్రాంగం.. తాజాగా వస్తున్న స్వైన్‌ఫ్లూ, డెంగీ బాధితులతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వచ్చే రోగులతోనే ఉస్మానియా కిక్కిరిసిపోతుంటే, మూడు రోజుల కింద గాంధీ ఆస్పత్రి నుంచి 20 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులను ఇక్కడికి పంపడం గమనార్హం. ప్రస్తుతం ఆస్పత్రిలో అధికారికంగా 1,165 పడకలు ఉండగా, అనధికారికంగా 1,385 పడకలు నిర్వహిస్తోంది. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 320 పడకలు ఏర్పాటు చేసింది. అయితే ఆస్పత్రికి వస్తున్న జ్వరపీడితులతో ఈ వార్డు కిక్కిరిసిపోతోంది. కొత్తగా వచ్చిన వాళ్లకు కనీసం పడక కూడా కేటాయించలేని దుస్థితి. ఆస్పత్రిలో 90 వెంటిలేటర్లు ఉండగా, 40 వెంటిలేటర్లు సాంకేతిక లోపాలతో మూలన పడ్డాయి.

స్వైన్‌కు ఇదే అసలైన కాలం!
చలి తీవ్రతకు హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తుంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెం బర్, జనవరిలో ఈ వైరస్‌ తన ప్రతాపాన్ని చూపుతుంది. అనేక మంది వీటి బారినపడి చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తుంటారు. వీరి లో డెంగీ, స్వైన్‌ఫ్లూ అనుమానితులు కూడా ఉం టారు. అడ్మిట్‌ చేసుకుని వీరి నుంచి నమూనా లు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపిన 48 గంటల తర్వాత రిపోర్ట్‌ వస్తుంది. ఆస్పత్రులకు వస్తున్న వారిలో పాజిటివ్‌ బాధి తులతో పోలిస్తే అనుమానితులే అధికం. వీరిని ఇతర వార్డుల్లో ఉంచి చికిత్సలు అందించలేరు. అలాగని పాజిటివ్‌ కేసుల సరసన చేర్చలేరు. ఇలాంటి వారితో పడకలు నిండిపోతున్నాయి. మూడు, నాలుగు రోజుల వరకు ఖాళీ కావట్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైద్యాధికారు లు ముందే దృష్టి సారించకపోవడం, తీరా సమస్య జఠిలమైన తర్వాత హడావుడి చేయ డం తప్ప కనీస చర్యలు కూడా చేపట్టట్లేదు.

ప్రభుత్వఆస్పత్రులకే ఎందుకంటే..?
సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్తే వైద్య పరీక్షలు, ఐసీయూలో చికిత్సల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ జ్వరానికి కూడా రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం, డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెరగటం.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు జరుగుతుండటంతో.. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకే మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని వార్తలు