రోడ్డున పడ్డ ‘అద్దె’ బతుకు!

2 Dec, 2017 02:47 IST|Sakshi

అనారోగ్యంతో బీడీకార్మికురాలు మృతి

అద్దె ఇంట్లోకి అనుమతించని యజమానురాలు  

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కార్మిక క్షేత్రంలో మరో అద్దెబతుకు రోడ్డున పడింది.  అద్దె ఇంట్లోకి శవాన్ని తేవొద్దని యజమానురాలు అడ్డుకుంది. సిరిసిల్లాకు చెందిన నిర్మల(70) అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమెకు శుక్రవారం గుండెపోటు రావడంతో ముగ్గురు కూతుళ్లు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చనిపోగా శవాన్ని అద్దెఇంటికి తీసుకొచ్చారు. అయితే, శవాన్ని తమ ఇంటికి తీసుకొస్తే అరిష్ట మంటూ యజమానురాలు నిరాకరించింది.

దీంతో చేసేదిలేక శివనగర్‌లోని మహిళా భవనం(సీడీఎస్‌) ఎదుట రోడ్డుపై శవాన్ని ఉంచారు. అంత్యక్రియలకు సైతం చేతి లో చిల్లిగవ్వ లేక కుటుంబసభ్యులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. స్పందించిన రాక్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ యువకులు రూ.ఐదు వేలు సాయం చేయడంతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా,సిరిసిల్లలో తరచూ ఇలాంటి అద్దెఇంటి విషాదాలు చోటు చేసుకుంటున్నాయని, మున్సిపల్‌ స్థలంలో భవనం నిర్మిస్తే ఇలాంటి అభాగ్యులకు సౌకర్యంగా ఉంటుందని గతంలో మంత్రి కేటీఆర్‌ ఆలోచన చేశారు. కానీ నేటికీ అది ఆచరణకు నోచుకోలేదు. 

మరిన్ని వార్తలు