బీర్‌ నో స్టాక్‌..

3 Jun, 2019 10:47 IST|Sakshi

ఆర్డర్‌లో 10 నుంచి 25 శాతం మాత్రమే సరఫరా..

ఒకేసారి  స్టాక్‌ ఇవ్వకపోవడంతో అదనపు భారం  

కోరుకున్న బ్రాండ్‌ దొరకడం కష్టమే...

వర్షాలు కురిసే వరకు ఇదే పరిస్థితి

సాక్షి సిటీబ్యూరో: ఎండల వేడి తారాస్థాయికి చేరింది. ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బీరు తాగి ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలనుకున్న  మద్యం ప్రియులకు మద్యం దుకాణాలు, బార్లలో బీర్లు నో స్టాక్‌ అనే సమాధానం వినిపిస్తుంది.దీంతో నిరాశకు లోనవుతున్నారు. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవిలో పలువురు విస్కీ, రమ్ము తదితరాలకంటే బీర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఉన్నప్పటికీ గ్రేటర్‌ పరిధిలో సమస్య మరింత ఎక్కువగా ఉంది.   ఉత్పత్తి తగ్గినందునే ఎండాకాలంలో బీర్లకు డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ అందుకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మద్యం ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీర్ల ఉత్పత్తికి అధికంగా నీరు అవసరం అవుతుంది. ఎండలతో జలాశయాలు, నదులు ఎండిపోవడంతో బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి 5 బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు నీటి సరఫరా జరుగుతుంది. అయితే జలాశయంలో నీరు లేకపోవడంతో కంపెనీలకు సరఫరా నిలిపివేశారు. దీంతో  ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సి వస్తోంది. 

10 నుంచి 20 శాతం మాత్రమే సరఫరా..
గతంలో బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ద్వారా 100 కార్టన్ల బీర్లు సరఫరా చేసే వైన్స్, బార్‌లకు ఆర్డర్‌ చేసిన మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో వారానికి రెండు సార్లు బేవరేజెస్‌ గోదాంల నుంచి బీర్ల సరఫరా జరిగేది. ప్రస్తుతం ఇండెంట్‌ పెట్టినా ఒకేసారి సరిపడిన స్టాక్‌ ఇవ్వకపోవడం, ఆర్డర్‌ చేసిన దాంట్లో కొంత మాత్రమే స్టాక్‌ ఇవ్వడంతో  ప్రతి రోజు బీర్ల స్టాక్‌ కోసం గోదాంలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దుకాణ దారులపై చలాన్, గేట్‌ పాస్, రవాణా ఇతర చార్జీల పేరుతో అదనపు భారం పడుతోంది. బీర్ల ప్రియులు అధికంగా ఇష్టపడే బ్రాండ్ల బీర్లు దొరకడం కష్టంగా మారింది. వైన్స్, బార్లకు 10 నుంచి 25 శాతం వరకే సరఫరా చేస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే స్టాక్‌ అయిపోతోంది. దీంతో దుకాణాల యజమానులు బీర్ల ప్రియులు అడిగిన బ్రాండ్‌ను ఇవ్వలేకపోతున్నారు.  ఎండ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు ఇష్టపడే బ్రాండ్‌ దొరకకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వాటితో సరిపెట్టుకుంటున్నారు. వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరి బీర్ల ఉత్పత్తి పెరిగితేనే సమస్య తీరుతుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు