మళ్లీ మొదటికి!

20 Aug, 2015 23:48 IST|Sakshi
మళ్లీ మొదటికి!

సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానికేతర ఉపాధ్యాయుల పదోన్నతుల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో 610 జీఓ పరిధిలో ఉన్న టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గతనెలలో జిల్లా విద్యాశాఖ అర్హుల జాబితా ప్రకటించి.. వారికి పదోన్నతులు ఇచ్చేందుకు ఉపక్రమించింది. ఇంతలో స్థానికేతర టీచర్లకు పదోన్నతి ఇస్తే స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూ.. పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈక్రమంలో గురువారం పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించగా.. తిరిగి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్థానికులకు న్యాయం చేయకుండా పదోన్నతులు ఎలా ఇస్తారంటూ విద్యాశాఖను నిలదీశాయి. దీంతో కౌన్సెలింగ్ రసాభాసగా మారింది.

 స్థానికుల సంగతి తేల్చాలి..
 పదోన్నతులిస్తే సదరు ఉద్యోగులు శాశ్వతంగా జిల్లాలోనే ఉంటారని, జిల్లాలో వందల సంఖ్యలో స్థానికులు నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి. గురువారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో 21 మందికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. అయితే గందరగోళం చోటుచేసుకోవడంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా పదోన్నతులకు అర్హులైన స్థానికేతర టీచర్లు 168 మంది ఉన్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా గుర్తించింది.

ఈక్రమంలో వీరికి పదోన్నతి ఇవ్వదలిస్తే.. ముందుగా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టాయి. ఈ వివాదాన్ని జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె జెడ్పీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సంఘాల డిమాండ్లు విన్న ఆమె.. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఈమేరకు విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు.

 స్పందించిన తర్వాతే..
 ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో.. అక్కడినుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో పదోన్నతుల కౌన్సెలింగ్ తాత్కాలికంగా వాయిదాపడింది. అయితే గతనెలలో జరిగిన పదోన్నతుల సమయంలోనూ ఇదే తరహాలో విద్యాశాఖ వ్యవహరించింది. ప్రభుత్వానికి నివేదిస్తామని జెడ్పీ చైర్‌పర్సన్ సమక్షంలో పేర్కొన్నప్పటికీ.. అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాశారా, లేదా..? అనే అంశంపై సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. లేఖ రాస్తే.. ప్రభుత్వం స్పందించిన తీరు ఎలా ఉందనే విషయం కూడా వ్యక్తం చేయకుండా విద్యాశాఖ హడావుడిగా కౌన్సెలింగ్ నిర్వహించడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నారు.  
 
 న్యాయం జరిగేవరకు పోరాటం: ఉపాధ్యాయసంఘాలు
  జిల్లాలో స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో సమతుల్యత చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. జిల్లాలో ఉన్న స్థానికేతర టీచర్లను సొంత ప్రాంతాలకు పంపలేని పరిస్థితిలో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి గురువారం జెడ్పీలో వినతిపత్రం అందజేశాయి. ఈ సందర్భంగా సంఘనాయకులు చెన్నకేశవరెడ్డి, ఆంజనేయులు, సధానంద్‌గౌడ్, విఠల్, అనంతరెడ్డి, మాణిక్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ స్థానికులకు న్యాయం జరిగేవరకు ఉద్యమిస్తామన్నారు.

మరిన్ని వార్తలు