‘హిందూజా’రిపోతోంది

19 Jun, 2015 03:46 IST|Sakshi
‘హిందూజా’రిపోతోంది

ఏకపక్షంగా పీపీఏల రద్దుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు తాపత్రయం
1040 మెగావాట్ల ‘హిందూజా’ విద్యుత్ పీపీఏ బుట్టదాఖలు
తెలంగాణ వాటాలకు ఏపీ సర్కారు గండి.. హిందూజాతో నేడు కొత్త ఒప్పందం
స్పష్టం కాని తెలంగాణపభుత్వ వైఖరి

సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య మరో కొత్త విద్యుత్ వివాదం తెరపైకి రాజుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒప్పందాలను కాలరాసి ఓ ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం విద్యుత్‌ను ఏపీ ప్రభుత్వం కైవసం చేసుకోబోతోంది.

హిందూజా గ్రూపు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 1040 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలోని 4 డిస్కంలు, హిందూజా గ్రూపు మధ్య పీపీఏ జరగగా, అందులో తెలంగాణకు రెండు డిస్కంలు ఉన్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వ ఒత్తిడితో హిందూజా గ్రూపు ఈ పీపీఏను రద్దు చేసి అక్కడి డిస్కంలతో కొత్త పీపీఏను కుదుర్చుకోబోతోంది. శుక్రవారం కొత్త ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.
 
ఇవీ ఇరు రాష్ట్రాల వాటాలు: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ర్టంలో ఉత్పత్తి/నిర్మాణ దశల్లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. పాత పీపీఏ అమలైతే హిందూజా నుంచి తెలంగాణకు 560.5 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉంటుంది.  హిందూజా ప్రాజెక్టు విషయం లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.  ‘హిందూజా’పై న్యాయపోరాటం చేయాలని టీ విద్యుత్ ఉద్యోగుల జేఏపీ కె.రఘు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు