ప్రభుత్వ పాఠశాలలో బెల్ట్‌షాపు వేలం!

27 Jun, 2017 02:24 IST|Sakshi
ప్రభుత్వ పాఠశాలలో బెల్ట్‌షాపు వేలం!
- నిర్వహించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్న వ్యాపారి
 
సాక్షి, నాగర్‌కర్నూల్‌: అది పవిత్రమైన ప్రభుత్వ పాఠశాల. చదువులమ్మ ఒడిలో అన్నీ తెలిసిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా బెల్ట్‌షాపునకు వేలంపాట నిర్వహించి పాఠశాల పవిత్రతను, ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతిష్టను మంటగలిపారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులూ అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా వ్యవహరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలకపల్లి మండలం ఆలేరు గ్రామమది. ఆ గ్రామంలో మద్యం అమ్మకాల కోసం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల అధ్యక్షతన ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామ ప్రజల సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెల్ట్‌షాపులో మద్యం అమ్మకాల కోసం వేలంపాట నిర్వహించాడు. సుమారు ఈ వేలంపాటకు 200 మందికి పైగానే హాజరు కాగా, అందులో 13 మంది వేలంపాటలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.5 వేలు డిపాజిట్‌ చేసి వేలం పాడగా, వారిలో ఒకరు రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్నారు.

కాగా, ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. నిత్యం పిల్లలకు విద్యాబుద్ధులు బోధించాల్సిన ఉపాధ్యాయుడే వేలంపాట కార్యక్రమాన్నిముందుండి నడిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ జనాభా 3,500 ఉంటుంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 15 బెల్ట్‌ షాపుల ద్వారా ప్రతిరోజూ రూ.50 వేలకు పైగా అక్రమంగా మద్యం వ్యాపారం జరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా తాగి తందనాలు ఆడుతుండటంతో మహిళలు వారిని వారించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఆలేరులో పాఠశాలలో వేలం నిర్వహించినట్లుగా వాట్సాప్‌లో ఫిర్యాదులు అందాయని, వేలం నిర్వహించిన వారిపైనా.. గ్రామంలో అక్రమంగా మద్యం దుకాణాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ ఈఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
మరిన్ని వార్తలు