బెల్టు తీయాల్సిందే!

19 Nov, 2019 10:25 IST|Sakshi
 తనిఖీల్లో పట్టుబడిన   మద్యంతో ఎక్సైజ్‌ అధికారులు(ఫైల్‌)   

‘కంచె.. చేను మేసిన రీతి’గా.. జిల్లాలో కొందరు ఆబ్కారీ అధికారుల అండదండలతో అడ్డగోలుగా బెల్ట్‌ షాపులను నడుపుతున్నారు. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా.. వీరికి మాత్రం అవి వర్తించవన్నట్లుగా ఈ తతంగం సాగుతుంది. దీంతో గ్రామాలు మద్యం మత్తులో జోగుతున్నాయి. ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు కట్టబెట్టడంతో కొత్తగా బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసుకునే పని ఊపందుకుంది. 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో మొత్తం 67 మద్యం దుకాణాలున్నాయి. ఇటీవల వీటన్నింటికి కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. మరో రెండేళ్ల పాటు వీరే దుకాణాలను నడిపించనున్నారు. దుకాణాలతో పాటు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బెల్టు దుకాణాలు సుమారు 350పైబడి ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా నవాబ్‌పేట, దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి అధికారిక దుకాణాల కంటే రెండింతలు అధికంగా ఈ దుకాణాలున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో రోజుకి రూ.3.50కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం అనుమతుల్లేని దుకాణాల ద్వారానే రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పలు బెల్టు దుకాణాల్లో రోజుకి రూ.50వేల మద్యం అమ్ముడవుతోంది. వీటిల్లో పగలు, రాత్రిళ్లు మద్యం విక్రయాలు జరుగుతుండడంతో యువత మద్యానికి బానిసవుతున్నారు.

నిబంధనలు ఇలా.. 
ఎలాంటి లైసెన్సులు లేకుండా మద్యం విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. ఇలాంటి వారిపై ఆబ్కారీ శాఖ అధికారులకు నేరుగా కేసులు నమోదు చేసే అధికారం ఉంది. పట్టుబడిన వారికి శిక్షతో పాటు భారీ జరిమానాలు అమలవుతాయి. 34ఏ టీఎస్‌ ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి వద్ద ఆరు లీటర్లు(బాటిళ్ల) మద్యం కలిగి ఉండవచ్చన్న నిబంధన ఉంది. అంతకు మించి ఉంటే అక్రమ మద్యంగా గుర్తిసారు. శుభకార్యాలు జరిగినా, విందు కార్యక్రమాలు ఉన్నా ఆరు బాటిళ్లకు మించి తీసుకోవద్దు. వాస్తవానికి ఒక వ్యక్తికి ఇంతకు మించి విక్రయించొద్దు. ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి ఉంటే గానీ నిబంధనలు దాటి మద్యం ఇవ్వకూడదు. ఇంత కఠినంగా నిబంధనలు ఉన్నా బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి.

మొక్కుబడిగా కేసులు 
బెల్టు దుకాణాల్లో కొందరు సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తమ బంధువులు, స్నేహితుల ద్వారా అనధికారికంగా మద్యం దుకాణాలు ఉంటే మొక్కబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. బెల్టు దుకాణాల నుంచి సర్కిళ్ల వారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న బెల్టు దుకాణాల నుంచి నెలకు రూ.2నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వీటిపై దాడులు చేసేందుకు సాహసించట్లేదు. నిజానికి గొలుసు దుకాణంపై దాడి జరిగినపుడు మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరగాలి. ఆ దుకాణంపై కూడా కేసు నమోదు చేయాలి. మద్యం సీసాలపై పక్కా ఆధారాలు కూడా ఉంటాయి. కానీ, ఈ తరహాలో అధికారులు దర్యాప్తు చేయట్లేదు. ఒకవేళ వివరాలు తెలిస్తే లైసెన్సుదారులతో బేరసారాలు చేసి కేసులు లేకుండా వదిలేస్తున్నారే ప్రచారం ఉంది.

వారిదే ప్రధాన ప్రాత 
బెల్టు దుకాణాల నిర్వహణలో మద్యం దుకాణాదారులదే ప్రధాన పాత్ర ఉంటోంది. ఒక్కో అధికారిక దుకాణం పరిధిలో 10 నుంచి 15 బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. ఎమ్మార్పీ ధరపై రూ.5 నుంచి రూ.50 వరకు తక్కువ చేసి ఈ దుకాణాదారులకు మద్యాన్ని కట్టబెడుతున్నారు. తిరిగి వీరు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.60 వరకు అదనం చేసి విక్రయాలు జరుపుతున్నారు. వీరికి ఎక్సైజ్‌ శాఖతో సంబంధాలు ఉండడంతో బెల్టు దుకాణాలపై దాడులు చేయకుండా చూసుకుంటున్నారు. చాలా చోట్ల లైసెన్సులు కలిగిన దుకాణాదారులే ఆబ్కారీ సిబ్బందికి నెలనెలా కొంత అమ్యామ్యాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

డిసెంబర్‌లో ప్రత్యేక తనిఖీలు 
కొత్త మద్యం దుకాణాలు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. బెల్టు దుకాణాల నిర్వహణపై డిసెంబర్‌ మొదటి వారంలో ప్రత్యేక తనిఖీలు చేస్తాం. మద్యం దొరికితే కేసులు నమోదు చేస్తాం. ఎవరూ అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేయరాదు. బెల్టు దుకాణాల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. 
– జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా  

మరిన్ని వార్తలు